మహాత్మాగాంధీ.. ఈ పేరు.. అహింస, నీతి, నిజాయితీ.. వంటి అనేక పేర్లకు మారు పేరుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. గాంధీ పేరుకు మచ్చగా నిలిచిపోయే ఘటన ఒకటి జరిగింది. మహాత్మా గాంధీకి స్వయానా మునిమనవరాలైన ఆశిష్ లతా రామ్గోబిన్(56)కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గాంధీ మునిమనవరాలికి జైలు శిక్ష అంటూ.. ప్రధాన మీడియాలో వస్తున్న వార్తలు చూసి.. గాంధేయ వాదులు, అభిమానులు నివ్వెర పోతున్నారు.
కేసు ఇదీ..
2015నాటి .. ఓ ఫోర్జరీ కేసులో దోషిగా తేలారు ఆశిష్ లతా రామ్గోబిన్. వ్యాపారవేత్త ఎస్ఆర్ మహరాజ్‌ను మోసం చేసినట్లు తేలింది. భారత్ నుంచి ఆమెకు వచ్చే ఒక కన్సైన్మెంట్కు కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్ ఆమెకు అడ్వాన్స్ రూపంలో రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చారు. దీనికి ప్రతిగా ఆ కన్సైన్మెంట్ నుంచి వచ్చే లాభాల్లో కొంత మొత్తం ఇచ్చేందుకు ఆశిష్ ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. అయితే.. పనిముగిసిన తర్వాత అటువంటి కన్సైన్మెంట్ ఏదీ లేదంటూ కొన్ని నకిలీ బిల్లులు సృష్టించి, మహరాజ్‌ను ఆమె మోసం చేశారు గాంధీ మునిమనవరాలు.
ఏం జరిగిందంటే..
ఆశిష్ మోసంపై మహరాజ్.. డర్బన్ కోర్టులో 2015లోనే ఫిర్యాదు చేశారు. ఆమె ఈ ఉదంతంలో… లేని కన్సైన్మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్లు, డాక్యుమెంట్లు తయారు చేశారని తేలింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆమె… 50 వేల ర్యాండ్లు పూచీకత్తుగా చెల్లించి, బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా మంగళవారం ఈ కేసులో తుదితీర్పు ఇచ్చిన డర్బన్ కోర్టు.. ఆశిష్ మోసం రుజువైందని వెల్లడిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ ఎంతో మంది పేదలకు న్యాయ సహాయం చేశారు. అయితే ఇప్పుడు గాంధీ పేరును ఆమె దిగజార్చేలా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.