గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `గేమ్ ఛేంజర్`. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయగా.. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. రూ. 300 కోట్ల బడ్జెట్ తో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ కలిసి గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా.. షూటింగ్ లో జాప్యం కారణంగా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
ఈ ఏడాది క్రిస్మస్కు ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ చేస్తామని దిల్‌రాజు చెప్పినప్పటికీ.. పలు కారణాల వల్ల మరోసారి వాయిదా వేశారు. 2025 సంక్రాంతి పండుగ కానుకగా గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా నిర్మాతలు ఈ సినిమా ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో.. కళ్లు చెదిరే ధరకు గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందట.
అయితే అమెజాన్ ప్రైమ్ వారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషా హక్కులను మాత్రమే కొనుగోలు చేశారట. అందుకు గాను రూ. 110 కోట్లు వెచ్చించారని జోరుగా టాక్ నడుస్తోంది. ఇక హిందీ డిజిటల్ రైట్స్‌ను మరో ఓటీటీ సంస్థకు అమ్మేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తంగా ఓటీటీ హక్కుల ద్వారానే మేకర్స్ కు రూ. 150 కోట్ల వరకు దక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, గేమ్ ఛేంజర్ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. విలక్షణ నటుడు ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, జయరామ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే 2025 జనవరి 10న వరల్డ్ వైడ్ గా గేమ్ ఛేంజర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.