సీనియర్ నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలో కీలక పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పతనం అనంతరం తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఆమె యాక్టివ్ గానే ఉన్నారు. కానీ టీడీపీ ఓటమి అనంతరం ఆమెలో చాలా మార్పు కనిపించింది. సడెన్ గా రోజు ఆమె తన పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.
వ్యక్తిగత కారణలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఆమె కొంతకాలంగా హాజరుకావడం లేదు. తన నియోజకవర్గం అయిన చంద్రగిరిలో కూడా యాక్టివ్ గా లేరు. దీంతో ఆమెకు చంద్రబాబుకు గ్యాప్ వచ్చింది. తాజా నిర్ణయంతో ఇక ఆమె పార్టీ వీడటం కూడా ఖాయమని తేలిపోయిందని చెప్పాలి.
గల్లా అరుణకుమారి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా? అని అందరిలో చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… బీజేపీ దీని వెనుక ఉందని అర్థమవుతోంది. లేకపోతే పార్టీలో అత్యున్నత నిర్ణాయక పదవిని వదులుకోవడం సామాన్యమైన విషయం కాదు.
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కాపులను, కృష్ణా నుంచి కింద నున్న కోస్తా జిల్లాలు, రాయలసీమలో కమ్మలను ఆకర్షించాలనీ బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఆమె ఈ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆమె వెనుక పురంధేశ్వరి ఉండొచ్చని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండాలని, పైగా బీజేపీకి భవిష్యత్తు ఉందని నమ్మిస్తూ జగన్ రెడ్డిని బూచిగా చూపి బీజేపీ ఆడుతున్న నాటకంలో ఆమె పావుగా మారినట్లు అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అరుణకుమారి రాజీనామా వ్యవహారంపై పార్టీలోనే నేతల మధ్య జోరుగా చర్చలు సాగుతున్నాయి.