మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దస్తగిరి.. సీబీఐ విచారణలో ఇచ్చిన వాంగ్మూలం వివరాలు బయటకు రావడం తెలిసిందే.
ఈ వ్యవహారంపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అయితే, దస్తగిరి వాంగ్మూలంలో లేని విషయాల్ని ప్రచురించారంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లుగా శ్రీకాంత్ చెప్పారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు పచ్చి అబద్ధాలతో దారుణమైన కథనాల్ని ప్రచురించాయని, ఈ రెండు పత్రికలు టీడీపీ అనుకూలమైనవని
వివేకా హత్యకు ఏడాదిన్నర క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి, దస్తగిరి వాంగ్మూలానికి లింకేంటని శ్రీకాంత్ ప్రశ్నించారు.
దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ చెప్పినట్లుగా ఆ మీడియా సంస్థలు చెప్పాయని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి విచారణ జరగకుండానే కథనాలు ప్రచురించారిన శ్రీకాంత్ వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి.
పైగా, అది దస్తగిరి వాంగ్మూలంగా మాత్రమే కథనాలు ప్రచురితమయ్యాయి తప్ప…సీబీఐ చెప్పినట్లు ఆ కథనాల్లో వెల్లడించలేదు.
పోనీ, అది దస్తగిరి వాంగ్మూలం కాదని సీబీఐ కూడా ఖండించలేదు. కానీ, శ్రీకాంత్ వ్యాఖ్యలు…గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్లున్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఒకవేళ గడికోట వ్యాఖ్యలతో ఏకీభవిస్తే…గతంతో వైఎస్ హత్యకు కుట్ర జరిగిందంటూ రష్యన్ వెబ్ సైట్ లో వచ్చిన కథనాన్ని వైసీపీ నేతలు ఓ రేంజ్ లో హైలైట్ చేశారని విమర్శలు వస్తున్నాయి.
అదంతా మరచిపోయిన శ్రీకాంత్…దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రచురిస్తే.. ఇంత హడావుడి చేయాలా? అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, గురివింద నలుపు దానికి కనిపించదంటూ కామెంట్లు వస్తున్నాయి.