టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అధ్యక్షతన ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట జరిగిన ఈ భేటీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జనసేన నేత కందుల దుర్గేశ్, కాంగ్రెస్ నేత నరసింహారావు, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. వీరంతా ముక్త కంఠంతో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. ఒక్క చాన్స్ అనగానే ప్రజలు వైసీపీకి అవకాశం ఇచ్చారని, ఆ చాన్స్ తీసుకున్న జగన్ వ్యవస్థలన్నింటిని తన గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, ప్రశ్నించిని వారిని అర్ధరాత్రి పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. కేసులు పెట్టినా భయపడబోమని, జైళ్లకు వెళ్లినా ప్రజా పోరాటం కొనసాగుతుందని అన్నారు.
వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని న్యాయవాది శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. జగన్ సర్కారును గద్దె దింపేది ఎస్సీ, ఎస్టీలేనని అన్నారు. త్వరలోనే ‘గడప గడపకు దగా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమన్నారు. సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం కేసు వరకు పోరాటం చేస్తున్నానని అన్నారు.
మతవాదుల పార్టీలతో పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని జనసేన పార్టీకి ఆయన సలహా ఇచ్చారు. ఈ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ దూరంగా ఉంది. మరోవైపు, వైసీపీ ప్రభుత్వ చర్యలపై సీజేఐకి వినతిపత్రం ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు, జిల్లా, మండల స్థాయుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అణచివేతకు గురైన వారికి ఈ వేదికల ద్వారా అండగా నిలవాలని తీర్మానించారు.