భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొంతకాలంగా బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి ఆహ్వానం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లలేదు. అంతేకాదు, ప్రధాని హోదాలో మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నప్పటికీ సీఎం హోదాలో కేసీఆర్ మర్యాదపూర్వకంగా కూడా మోడీని కలిసేందుకు ఇష్టపడలేదు. కేసీఆర్ కు బదులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోడీకి స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వంపై మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటానని, అందుకే ఎన్ని రాష్ట్రాల్లో తిరిగినా అలసిపోనని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలో బిజెపి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ … టిఆర్ఎస్ నేతలపై ఈ విధంగా పరోక్షంగా చురకలంటించారు. తనను, బిజెపిని తిట్టడమే టిఆర్ఎస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, ఇలా తిట్టడం వల్ల తెలంగాణకు ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే ఎన్నైనా తిట్టుకోవచ్చని మోడీ షాకింగ్ కామెంట్ చేశారు.
అయితే, తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించని, దానికి దీటైన జవాబు చెప్పి తీరుతానని మోడీ అన్నారు. తాను చాలా రాష్ట్రాల్లో తిరుగుతుంటానని, అలసిపోతానేమో అని తనను కొందరు ప్రశ్నిస్తూ ఉంటారని మోడీ అన్నారు. అయితే, గత 22 ఏళ్లుగా తనను చాలా మంది తిడుతూనే ఉన్నారని, తనని తిట్టేవారిని పట్టించుకోవద్దని, ఆ తిట్లే తనకు బలమని బిజెపి కార్యకర్తలకు మోడీ చెప్పారు. సాయంత్రం చాయ్ తాగుతూ ఆ తిట్లను ఎంజాయ్ చేయండి అంటూ కార్యకర్తలకు మోడీ సలహా ఇచ్చారు.
ప్రజలకు సేవ చేసేందుకు ఏకైక మార్గం రాజకీయమని, అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని మోడీ అన్నారు. సేవా భావంతో రాజకీయాలు చేయాలని, కానీ తెలంగాణలో మాత్రం మోడీని తిట్టడమే అధికార పార్టీ నేతలు రాజకీయం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు ఎన్ని తిట్టినా తాము మాత్రం పాజిటివ్ దృక్పథంతోనే ఉంటామని, బిజెపి కార్యకర్తలు అంకితభావంతోనే ప్రజా సేవ చేస్తారని మోడీ అన్నారు.
తెలంగాణలో 9500 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. 6300 కోట్ల రూపాయల ఖర్చుతో పునరుద్ధరించిన ఆర్ఎఫ్ సీఎల్ పరిశ్రమను మోడీ జాతికి అంకితం చేశారు. దాదాపు 1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైనును కూడా దేశ ప్రజలకు అంకితం చేశారు.