ఏపీ సీఎం జగన్ తన హయాంలో తీసుకుంటున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. పాలనా పరంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలలోనూ పలు లోపాలుండడం సంగతి పక్కనబెడితే…అనవసరమైన పలు విషయాల్లోనూ ఏపీ ప్రభుత్వం వేలు పెట్టి చేతులు కాల్చుకుందన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జగన్ ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలపై టాలీవుడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
ఆన్ లైన్ టికెటింగ్ విధానం, టికెట్ల రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు వంటి వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై పలువురు సినీ ప్రముఖులు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ, తగ్గేదేలే అన్న జగన్….సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ సంచలన జీవో నం.39ని జారీ చేశారు. ఈ క్రమంలోనే కొందరు సినీ నిర్మాతలు ఆ జీవోను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…జగన్ కు షాకిచ్చింది.
టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నం.35ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. భారీ బడ్జెట్ పెట్టి తీసే కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని, ఆ హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సినిమా టికెట్ ధరలపై తగ్గింపు విధించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో నం.35ను సస్పెండ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు, పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లను నిర్ణయించుకునే అధికారాన్ని థియేటర్ల యజమానులకు కల్పించింది. హైకోర్టు తాజా నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.