వైసీపీ తరఫున గెలిచి.. తర్వాత.. ఆ పార్టీకి వివిధ కారణాలతో దూరమైన నలుగురు ఎమ్మెల్యేల విషయం ఇప్పటికే హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఒకవైపు.. ఈకేసు కోర్టులో ఉండగానే.. మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాం.. వారికి తాజాగా నోటీసులు జారీ చేశారు. “మీరు కోరినంత సమయం ఇచ్చేందుకు కుదరదు“ అని తేల్చి చెప్పారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా ఇచ్చానని పేర్కొన్న ఆయన వచ్చే నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఆఫీసుకువచ్చి వివరణ ఇవ్వాల్సిందేనని డేటు, టైము ఫిక్స్ చేసేశారు. దీంతో ఇప్పుడు ఇదే ఆఖరు అవకాశమని స్పీకర్ కార్యాలయం ఆయా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరీ తేల్చి చెప్పింది.
వైసీపీ ఎమ్మెల్యేలు.. ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ ఎమ్మెల్యే), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), ఆనం రామనారాయణ రెడ్డి(వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(నెల్లూరు రూరల్)లకు మరోసారి నోటీసులు జారీ చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచి.. విప్‌ను దిక్కించిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ చీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే.. వారు ప్రతిసారీ సమయం కోరారు. ఇటీవల వచ్చినప్పుడు.. తమపై వేటు వేయాలని కోరుతూ.. ఫిర్యాదు చేసిన వ్యవహారంపై ఆయా ఆధారాలను ఇవ్వాలని కోరారు.
దీంతో స్పీకర్ కార్యాలయం వాటిని అందజేసింది. అయితే.. సదరు పెన్‌డ్రైవ్‌లు, సీడీలు ఓపెన్ కావడం లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మరోవైపు.. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. కానీ, హైకోర్టు ఇప్పటికిప్పుడు దీనిపై జోక్యం చేసుకోలేనని.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటా రో వేచి చూసి అప్పుడు తగిన ఆదేశాలు ఇస్తామని తేల్చి చెప్పింది. ఇంతలో బుధవారం మూడో సారి స్పీకర్ కార్యాలయం వారిని నోటీసులు పంపించింది. ఇదే తుది నోటీసులని.. 8వ తేదీ . ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందేనని.. తదుపరి స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని అధికారులు తేల్చిచెప్పారు.
ఎమ్మెల్యేలకు పంపింన పెన్ డ్రైవ్‌లు, సీడీలని ఓపెన్ చేయడంలో ఎలాంటి సాయం అవసరం అయినా శాసనసభ కార్యదర్శి కార్యాలయాన్ని సంప్రదించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. 8వ తేదీన జరగనున్న విచారణకు ఖచ్చితంగా హాజరవ్వాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు నలుగురు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీరిపై వేటు వేస్తే.. వారు ఓటు వేసేందుకు అనర్హులు అవుతారు.