మల్టీ ఫ్లెక్స్ లో సినిమా చూడాలన్నదే సినిమా ప్రియుల కోరిక. ఈ బలహీనతను ఆసరా చేసుకుని యాజమాన్యాలు అక్కడి ఫుడ్ అధిక ధరలకు అమ్ముతూ బాగా దోచుకుంటూ ఉంటాయి. బయట 10 రూపాయలకు దొరికే పాప్ కార్న్ 250 రూపాయలకు అమ్ముతారు. సరే ఫుడ్ అంటే… కొంటే కొనొచ్చు లేదంటే లేదు.
ఎందుకంటే సినిమా నడిచేది మూడు గంటలే. వెళ్లే ముందు ఏదైనా తినిపోతే సరిపోతుంది. మళ్లీ బయటకు వచ్చినపుడు తినొచ్చు కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. కానీ మంచినీళ్ల తోనే సమస్య అంతా. బయట నుంచి మంచి నీళ్లు తీసుకుపోవడానికి వీళ్లేదంటారు. పోనీ వాళ్ల వద్ద కొందాం అంటే అర లీటరు 50 రూపాయలట. దీనిపై చాలా కాలం నుంచి వివాదం నడుస్తోంది. కానీ కొలిక్కి రాలేదు. కానీ తాజాగా ఓ పిటిషనర్ జోక్యంతో కోర్టు మల్టీప్లెక్స్ లకు వార్నింగ్ ఇచ్చింది.
సినిమా థియేటర్లోకి బయటి నుంచి మినరల్ వాటర్ అనుమతించాలి. లేదా థియేటర్ యాజమాన్యమే ఉచితంగా మంచినీరు అందుబాటులో ఉంచాలి అని తమిళనాడు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దేవరాజన్ అనే పౌరుడు 2016లో వేసిన పిటిషన్ పై ఇపుడు తీర్పు వచ్చింది. థియేటర్ల వారు సెక్యూరిటీ రీజన్స్ తో బయటి బాటిల్స్ ను అనుమతించడం లేదని జస్టిస్ ఎస్ఎమ్ సుబ్రహ్మణ్యం బెంచ్ వెల్లడించింది. సెక్యూరిటీ సమస్య ఉంటే కచ్చితంగా యాజమాన్యమే ఏర్పాటు చేయాలి అని ఆదేశించింది.
మరి తెలంగాణ, ఆంధ్రలో చట్టం ఏం చెబుతోంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ‘సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ 1955’ లో ప్రేక్షకులు తమ సొంత ఆహారం మరియు నీటి సీసాలను మల్టీప్లెక్స్‌లు మరియు థియేటర్లలోకి తీసుకెళ్లడానికి ఎటువంటి సమస్య లేదని చెబుతోంది. ఇటీవలే అవినీతి నిరోధక కార్యకర్త విజయ్ గోపాల్ ఆర్టీఐ ద్వారా ఈ విషయం బయటపెట్టారు. అయితే, ఈ విషయం చాలామందికి తెలియకపోవడం వల్ల మల్టీ ప్లెక్స్ వాళ్లు చెప్పిందే చట్టంలా నడుస్తోంది.