ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని 2025 సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నామని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుబెడతామని ప్రకటన చేశారు. బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అందుకే ఈ పథకం అమలు లేటైందని చెప్పారు. దాంతోపాటు, ఆటో డ్రైవర్ల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15, దీపావళి నాడు ఈ ఉచిత బస్సు పథకం ప్రారంభించాలని నిర్ణయించినా…కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలవుతున్న తీరు, పథకంలోని లోపాలను విశ్లేషించి అవి పునరావృతం కాకుండా ఏపీలో పక్కాగా ఈ పథకం అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావించారు. అందుకే, ఈ పథకం అమలులో ఆలస్యమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పథకంపై యార్లగడ్డ వెంకట్రావు తన సోషల్ మీడియా ఖాతాలో ఇచ్చిన బిగ్ అప్డేట్ పోస్ట్ వైరల్ గా మారింది.