రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో సీఎం చంద్రబాబు దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయిం చుకున్నారు. సంక్షేమం అంటే.. తమకే పేటెంట్ ఉందని.. తమది సంక్షేమ ప్రభుత్వమని.. తాము చేసినట్టు దేశంలో ఎవరూ చేయలేదని పదే పదే చెప్పుకొనే మాజీ సీఎం జగన్కు ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను వడివడిగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా మూడు కీలక పథకాలకు చంద్రబాబు డేట్ ఫిక్స్ చేసినట్టు పార్టీ వర్గాలు , ప్రభుత్వ వర్గాలు కూడా చెబుతున్నాయి. వాటిలో అత్యంత కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆగస్టు 15(అంటే నెల రోజుల సమయం)న ఖచ్చితంగా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి తీరాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబరు చివరిలో దీనిని ప్రారంభించాలని నిర్ణయించినట్టు ముందు వార్తలు వచ్చాయి.
కానీ, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ఉన్న దరిమిలా.. అదే రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది. ఇక, రెండో కార్యక్రమం “అమ్మకు వందనం“ పేరుతో స్కూల్ కు వెళ్లే చిన్నారుల తల్లుల ఖాతాల్లో రూ. 15000 చొప్పున ఇచ్చే పథకానికి కూడా అదే రోజు శ్రీకారం చుట్టను న్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలను కూడా.. ప్రభుత్వం జీవో 29 ద్వారా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు 15న దీనిని కూడా ప్రారంభించనున్నారు.
ఇక, ఇంకో కీలక పథకం.. అన్నా క్యాంటీన్లు. ఇది సంక్షేమ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాస్తవానికి సెప్టెంబరు చివరి వారంలో దీనిని అమలు చేయాలని అనుకున్నా.. ఇప్పుడు దీనిని కూడా.. ఆగస్టు 15నే ప్రారంభించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. భవనాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని.. ఆగస్టు 15నే దీనిని ప్రారంభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ మూడు పథకాల అమలు ద్వారా.. జగన్కు భారీ షాక్ ఇచ్చేలా చంద్రబాబు దూకుడుగా ముందుకు సాగుతుండడం గమనార్హం.