గత ఏడాదిన్నర కాలంగా మానవాళిపై కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సిలెండర్లు, అంబులెన్స్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సకాలంలో అంబులెన్స్ దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. ఇక, కొన్ని చోట్ల అంబులెన్స్ లు ఉన్నా….భారీగా కిరాయి వసూలు చేయడంతో పేదలు నానా ఇబ్బందులు పడ్డారు.
ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని చోట్ల అంబులెన్స్ సేవలు ఉచితంగా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ నటుడు శివాజీ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని ‘మనం సైతం’ సేవా సంస్థకు ఆ అంబులెన్స్ ను శివాజీ అందజేశారు. ఈ అంబులెన్స్ ప్రాంరభోత్సవ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్ తదితరులు పాల్గొన్నారు.
తమ సంస్థ చేపడుతోన్న సేవా కార్యక్రమాలకు ఉచిత ఆంబులెన్స్ సేవలు కూడా తోడవడం ఒక గొప్ప ముందడుగని కాదంబరి కిరణ్ అన్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఎంతోమందికి తమ సంస్థ ద్వారా సహాయం చేశామని అన్నారు. తమ సంస్థకు హీరో శివాజీ ఆంబులెన్స్ సమకూర్చడం హర్షణీయమని శివాజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆంబులెన్స్ సేవలు పూర్తిగా ఉచితమని అన్నారు. భవిష్యత్ లో సపర్య పేరుతో వృద్ధాశ్రమం స్థాపించి నిరాదరణకు గురైన వారికి ఆశ్రయం కల్పించాలన్నది తన కల అన్నారు.