ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని.. అమరావతి కోసం తాము అనేక త్యాగాలు చేశామని చెబుతూ.. ఈ ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలు, పోరాటాలకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. చంద్రబాబు హయాంలో ఏపీకి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించిన విషయం తెలిసిందే. 33 వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి.. ఇక్కడ 9 ప్రధాన నగరాలను నిర్మించాలని ప్లాన్ చేశారు.
అయితే.. వీటిని ప్రారంభించే సమయానికే చంద్రబాబు ప్రభుత్వం పిపోయి.. వైసీపీ వచ్చింది. వచ్చీ రావడంతోనే అమరావతి రాజధానిలో అవినీతి జరిగిందని.. ఇక్కడ కోట్లకు కోట్ల సొమ్ము దోచేశారని ఆరోపణలు చేసింది. అనంతరం.. అసలు ఒక్కరాజధానికాదు..మూడు కావాలంటూ.. మెలికలు పెట్టింది. ఈ క్రమంలోనే అమరావతిని దిక్కులేకుండా చేసింది. విశాఖ(పాలన), కర్నూలు(న్యాయ), అమరావతి (శాసన) అంటూ.. మూడు రాజధానులను ప్రకటించింది.
అయితే.. ఈ మూడు రాజధానులకు వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతో అమరావతి రాజధాని రైతులు ఉద్యమించారు. ఈఉద్యమానికి ఆదివారంతో నాలుగేళ్లు నిండాయి. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. కేసులు, జైళ్లను సైతం లెక్క చేయకుండా తమకు న్యాయం చేయాలని నినదిస్తు దీక్షలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో శిబిరాలు.. మహిళలే ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు ఉద్యమం.. మరో వైపు న్యాయపోరాటం చేస్తున్నారు.
మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ ఆకాంక్ష నెరవేరుతుందని ఇక్కడి రైతులు భావిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. మూడు రాజధానుల పోరాటానికి దిగిని రైతులకు.. దేశవ్యాప్తంగా మద్దతు లభించడం గమనార్హం. ఇదిలావుంటే.. తమ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో మహిళా రైతులు ఆదివారం కూడా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని పేర్కొంటూ.. దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి.. నిరసపన తెలిపారు.