సీఎం జగన్ కు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. అధికార వైసీపీలో కలకలం రేగేలా ఏకంగా నాలుగు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఛైర్మన్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ ఛైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు, తిరుపతి ఛైర్మన్ పద్మజ నారుమళ్లి, ఏలూరు ఛైర్మన్ బొద్దాని అఖిల, కాకినాడ ఛైర్మన్ అల్లి రాజబాబులు ఏకకాలంలో తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు పంపించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఛైర్మన్లుగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆ నలుగురు చాలా అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ స్మార్ట్ సిటీలకు కార్యాలయాలు, సిబ్బంది, నిధులను మాత్రం ఇంత వరకు కేటాయించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ నలుగురు రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే, సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పోరేషన్ చైర్మన్ల నియామకాలు చెల్లవని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోనే వారు రాజీనామా చేశారని మరో ప్రచారం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా స్మార్ట్ సిటీ ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీంతో, కేంద్ర ప్రభుత్వం ఆ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఆ పదవుల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో తగు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే వారితో రాజీనామా చేయించిందని టాక్ వస్తోంది.
అంతేకాదు, ఆ నలుగురి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించినట్లు కూడా తెలుస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది. ఆ తర్వాత విశాఖ, ఏలూరులను కూడా స్మార్ట్ సిటీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటికి న్యాయపరంగా అభ్యంతరాలు ఉండటంతో భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదనే కారణంతోనే ప్రభుత్వం వారితో రాజీనామాలు చేయించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా…తమ ఛైర్మన్ల పదవులు మూన్నాళ్ల ముచ్చటగానే మిగలడంతో సదరు వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే, వీరికి వేరే నామినేటెడ్ పదవులిచ్చి బుజ్జగించనున్నారని తెలుస్తోంది.