ఏపీలో శాంతి, భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓవైపు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరసనకు దిగితే.. మరోవైపు వైసీపీ కి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీకి రాజీనామా చేసిన నాలుగు రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య తాజాగా వైసీపీని వీడారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో తొలుత సమావేశమైన ఆయన.. ఆపై రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ అధిష్టానంపై కిలారి రోశయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా సరైన గుర్తింపు దక్కలేదని.. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
వైకాపా కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తుందని విమర్శించారు. ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లుకి శాసనమండలి చైర్మన్ అన్నారు.. కానీ చివరకు అన్ని అర్హతలు ఉన్న ఆయన్ను పక్కన పెట్టారు. కనీసం ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేని రోశయ్య దుయ్యబట్టారు. గుంటూరు నుంచి ఎంపీగా నన్ను నిలబెట్టి మానసికంగా కృంగదీశారని ఆయన వాపోయారు. వైసీపీలో తాను ఇక కొనసాగలేనని.. అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కిలారి రోశయ్య ప్రకటించారు.