మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధ ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రేషన్ బియ్యం అవకతవకల కేసులో ఉచ్చు బిగుసుకోవడంతో.. పేర్ని నాని దంపతులకు అరెస్ట్ భయం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంలోని పేర్ని నాని భార్య పేరిట ఉన్న గోదాములను ఏపీ పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకుని బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా వాడుకుంటోంది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు గోదాములో 7,719 బస్తాల రేషన్ బియ్యం ఉంచగా.. వాటిలో 3,708 బస్తాలు మాయం అయ్యాయి.
ప్రతినెలా నిర్వహించే తనిఖీల్లో ఈ విషయం గుర్తించినా.. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో అధికారులు గుట్టుగా ఉంచారు. కానీ, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పేర్ని నాని గుట్టు రట్టు అయింది. రూ. 90 లక్షల విలువ చేసే రేషన్ బియ్యం గల్లంతైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు నిగ్గుతేల్చారు. రేషన్ బియ్యం అక్రమాలపై అధికారులు ఫిర్యాదు చేయగా.. రెండు రోజులు క్రితం మచిలీపట్నం పోలీసులు గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజ్ మరియు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసు నమోదు కాగానే అరెస్ట్ తప్పదని భావించి పేర్ని నాని కుటుంబంతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజ కూడా అందుబాటులో లేకుండా పోయారు. నాని ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి కూడా పేర్ని నాని హాజరు కాకపోవడంతో అజ్ఞాతం వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా, బియ్యం మాయమైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ శుక్రవారం జయసుధ మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.