మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ భయంతో హైడ్రామాకు తెర లేపారు. కేసులకు భయపడనంటూ మీడియా ముందు హడావుడి చేస్తున్న కాకాణి.. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు మాత్రం వెనకాడుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ తవ్వకాలు, ఖనిజం రవాణా, పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించిన వ్యవహారంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇవ్వగా.. కాకాణి గైర్హాజరయ్యారు.
ఈ క్రమంలోనే కాకాణి పరారీలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకొంటున్నట్లు తెలిపేలా కాకాణి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. మొదట పోలీసులు నెల్లూరులోని కాకాణి నివాసం వద్దకు వెళ్ళగా.. అక్కడ ఆయన లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసు అంటించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నివాసానికి వెళ్లగా.. అక్కడ కూడా కాకాణి లేరు. కనీసం ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు. రెండో నోటీసును ఆయన కుమారుడికి అందజేశారు.
అలాగే కాకాణి కోసం హైదరాబాద్ లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఆయన తెలివిగా ఫోన్ ఒక ప్రాంతంలో.. తాను మరో ప్రాంతంలో ఉంటూ పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు. గతంలోనూ ఓ కేసులో పోలీసులకు చిక్కకుండా పరారైన కాకాణి.. సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అలాగే కేసు క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేశారు.
కానీ, కాకాణి పిటీషన్లపై విచారణను హైకోర్టు గురువారం నాటికి వాయిదా వేసింది. ఇకపోతే బుధవారం సాయంత్రం నెల్లూరుకు వచ్చి.. గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పలువురికి కాకాణి ఫోన్లు చేస్తున్నట్లుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణికి మూడోసారి నేరుగా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.