ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని వీడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితమే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇంతలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది.
మాజీ డిప్యూటీ సీఎం, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తాజాగా వైసీపీని వీడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న నాని.. ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి పదవికి మరియు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.