గత రెండు వారాలుగా ఏపీ అకాల వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటువంటి విపత్తు వచ్చినపుడు ప్రజలకు ఆపన్న హస్తం అందించాల్సిన జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, వరద బాధితులకు సకాలంలో సహాయక చర్యలు అందించలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
నెల్లూరు జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా ముంపు గ్రామాల్లో ఇప్పటికీ దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా గ్రామాలు ఇంకా నీటమునిగే ఉన్నాయి. మరోవైపు, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాసం, ఆహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్నా తమను పట్టించుకోలేదంటూ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నెల్లూరులోని వరదముంపు గ్రామాల్లో పర్యటించేందుకు వెళ్లిన మంత్రి బాలినేని, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ లకు బాధితులు షాకిచ్చారు. తామంతా నష్టపోయిన తర్వాత సినిమా చూడటానికి వచ్చారా అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సర్ది చెప్పేందుకు బాలినేని ప్రయత్నించినా వారు వినలేదు. మంత్రితో వాగ్వాదానికి దిగిన వరద బాధితులు ఆయనను ఘెరావ్ చేశారు. దీంతో, పోలీసుల సాయంతో మంత్రి బాలినేని తదితరులు అక్కడ నుంచి అతి కష్టం మీద తమ వాహనాల్లో వెనక్కు వెళ్లిపోయారు.