నియోజకవర్గంలో ఎంఎల్ఏ రోజాకు రోజురోజుకు తలనొప్పులు బాగా ఎక్కువైపోతున్నాయి. కొంతకాలంగా రోజా ప్రత్యర్థి వర్గం బలపడటంతో పార్టీ కార్యక్రమాలు సమాంతరంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు తనకు తెలీకుండా జరగకూడదని రోజా గట్టిగా అనుకున్నారు. అయితే కొన్ని కార్యక్రమాలు రోజాతో సంబంధం లేకుండానే జరిగిపోతున్నాయి. దాంతో ప్రత్యర్థి వర్గం పై రోజా మండిపోతున్నారు. ఈ కారణంగానే రెండు వర్గాల మధ్య రెగ్యులర్ గా గొడవలైపోతున్నాయి.
ఈ నేపధ్యంలోనే నగరి పట్టణంలో కట్టిన పెద్ద ఫ్లెక్సీలను చించేయటం సంచలనంగా మారింది. రోజా ప్రత్యర్ధి వర్గంలోకి చక్రపాణిరెడ్డి, కేజే కుమార్ తదితరుల ఆధ్వర్యంలో నగరి పట్టణంలో 40 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంగళవారం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని పట్టణమంతా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోమవారం ఉదయానికి చిరిగిపోయి కనిపించాయి. విషయం తెలియగానే చక్రపాణి, కేజే కుమార్ వర్గం మండిపోయింది. నగరి మాజీ ఎంపీపీ ఏళుమలై ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర పెద్ద ధర్నానే జరిగింది.
ట్రాఫిక్ ను ఏళుమలై తదితరులు అడ్డుకుంటున్నారన్న కారణంగా వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. దాంతో విషయం తెలుసుకున్న మిగిలిన నేతలంతా పోలీసు స్టేషన్ కు చేరుకుని గొడవకు దిగారు. టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలపనే అంటు పరోక్షంగా రోజా+ఆమె మద్దతుదారులపై మండిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోజాయే టీడీపీలో నుండి వచ్చారు.
ఎప్పుడైతే తన ప్రత్యర్థి వర్గం తయారైందో వాళ్ళని ఎదుర్కునేందుకు టీడీపీలో నుండి కొందరిని పార్టీలోకి లాక్కున్నారు. అందుకనే ప్రత్యర్థి వర్గం ఎవరి పేరు చెప్పకుండానే టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే జగన్ ఫ్లెక్సీలను చింపేసినట్లు ఆరోపించారు. వైసీపీ నేతలు ఎవరు జగన్ ఫ్లెక్సీలను చింపరంటు చక్రపాణిరెడ్డి తేల్చేశారు. దాంతో ఇపుడు అందరి అనుమానాలు రోజా వర్గంపైకే మళ్ళింది.
సరే ఫ్లెక్సీలను ఎవరు చింపారనేది పెద్ద సమస్యే కాదు. ఎందుకంటే చింపినవారు ఎవరన్న విషయం ఏదో రోజు బయటపడుతుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రోజా ప్రత్యర్థి వర్గం రోజురోజుకు బలపడుతున్నదనే. ప్రత్యర్థి వర్గం ఎంతగా బలపడితే రోజాకు అంత సమస్య. రాబోయే ఎన్నికల్లో తన ప్రత్యర్థి వర్గం సహకరించకపోతే రోజా గెలుపు డౌటే. అసలు రోజాకు టికెట్టే రానీయకుండా చేయాలన్నది ప్రత్యర్థి వర్గం ప్రయత్నం. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.