గత ఆరు నెలలుగా క్షణక్షణం మారుతున్న అనేక పరిణామాలతో ఆసక్తికరంగా జరిగిన ప్రస్తుత ‘తానా’ ఎన్నికల ఓట్ల కౌంటింగులో కొద్ది తేడాలో నరేన్ కొడాలి వర్గం ఓడిపోయినట్లు ప్రకటించటం తెలిసిందే. అయితే ‘నమస్తే ఆంధ్ర’ గత కొన్ని నెలలుగా చెపుతున్నట్లే “ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ??” అనే విధంగా ఫలితాలు స్పష్టంగా ప్రకటించిన 48 గంటల లోపు(ఎలక్షన్ నిబంధన పరిధిలోనే) ఓడిపోయిన అభ్యర్థులందరూ మూకుమ్మడిగా ‘తానా’ బోర్డుకు, ఎలక్షన్ కమిటీకు అనేక విషయాలపై అభ్యంతరాలు తెలియజేస్తూ బోర్డు అత్యవసరంగా సమావేశమై ఎన్నికల ఫలితాలను నిలిపివేసి సమస్యలను కూలంకషంగా చర్చించి పరిష్కరించ వలసినదిగా నిబంధనల మేరకు సవివరంగా కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది.
వీటిలో ముఖ్యంగా ‘తానా’ జీవిత సభ్యుల డేటా అవకతవకలు, అడ్రస్ చేంజ్ విషయంలో జరిగిన అనేక అనుమానాస్పద నిర్ణయాలు, ఓటర్ల లిస్టుల మధ్యన వివిధ సమయాల్లో బయటపడిన అనేక వైరుధ్యాలు, ఈ వైరుధ్యాల మూలంగా జరిగిన అనేక ఇబ్బందులు, ముఖ్యంగా నామినేషన్లు కూడా తిరస్కారం జరగడం, ఓటర్ల అడ్రస్ మార్పులపై ప్రస్తుత కార్యవర్గ సభ్యులపై ఉన్న ఆరోపణలు, సభ్యులకు ఎటువంటి క్లియర్ కమ్యూనికేషన్ గాని లాగిన్ ఫెసిలిటీ గాని పనిచేయకపోవడం, అడ్రస్ మార్పుల లాగ్ ఫైల్ ను బయలు పరచక పోవడము, ఎన్నికల షెడ్యూల్స్ ను అనేకసార్లు సరైన పద్ధతి విధానం లేకుండా మార్పులు చేయడాలు, ఓటర్ల లిస్టు ఫైనల్ అయిన తర్వాత కూడా మార్పులు జరగడాలు, కొన్ని విషయాలపై సమస్యలను పరిశీలించటానికి వేసిన కమిటీలు ఎటువంటి దిద్దుబాటు చర్యలు చెయ్యలేక పోవడం, ఎలక్షన్ కమిషన్ సభ్యులతో గాని, అభ్యర్థులతో గాని, వెబ్సైటులో గాని, సరిగా ఎప్పటికప్పుడు మార్పు చేర్పులను వివరించకపోవడం, షెడ్యూల్స్ ఎన్నిమారినా బాలట్లు తిరిగి చేరే తేదీని కదపకపోవడం, నియమించిన థర్డ్ పార్టీ వారు సరియైన విధముగా ప్రవర్తిచలేక పోవడం, రెండు సార్లు బాలట్లు ముద్రించడం, గంపగుత్తగా వచ్చిన బాలట్లను నిరాకరించకపోవడం, లెక్కించే యంత్రం సరిగా పనిచేయకపోవడం, ఎప్పటికప్పుడు కాక, ఫలితం మొత్తం చివరిలోనే ప్రకటించటం, అభ్యర్థుల ప్రశ్నలకు సరియైన సమాధానం ఇవ్వ లేకపోవడం వంటి అనేక ముఖ్య విషయాలను కంప్లైంటు లో ఉటంకిస్తూ పంపడంతో ఒక్కసారిగా అమెరికా తెలుగు కమ్యూనిటీ లో మళ్లీ సంచలనం మొదలైయ్యింది.
ఇప్పుడు ఏమి జరగబోతుంది అనేదానిపై అనేక ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. నిరంజన్ ప్యానెల్ గెలిచిన ఆనందంలో సెలబ్రేషన్ ఏర్పాట్లు ఒక పక్క జరుగుతుండగా, ఓడిన నరేన్ వర్గానిది స్వల్ప తేడా అవ్వడం మూలాన మరియు అనేక అనుమానాస్పద విషయాలపై క్రితంలోలాగా మెత్తగా ఉండటం కాకుండా గట్టిగా పోరాడాలని నిశ్చయించుకోవడం తో తెలుగు సమాజంలో మళ్ళీ ఘర్షణ మొదలైనట్లే అని అనేకమంది భావిస్తున్నారు. అలాగే ‘తానా’ లో సభ్యుల డేటాబేస్ లో ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ఉండే అక్రమ డూప్లికేట్లు, దొంగ యుటిలిటీ బిల్లులతో ఒకే అడ్రసుకు అనేక ఓటర్ల అడ్రస్ మార్పు ప్రయత్నాలు, అక్రమ బాలట్ కలెక్షన్లు, ‘తానా’ బోర్డు అనేక సందర్భాలలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు పై ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలు లేక పోవడం తో సరైన పద్ధతిలో పోరాడితే విచిత్రమైన మలుపులతో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరగవచ్చు. ఏదో విధంగా ఇప్పటికైనా అందరూ ఆశించే మార్పులు ఈ విధంగానైనా సంభవించి ‘తానా’ సంస్థ మెరుగు పడే అవకాశాలుంటాయేమో చూద్దాము.