కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వాయు వేగంతో ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ బారిన పడిన దేశాల నుంచి వచ్చేవారిపై భారత్ లోని అన్ని రాష్ట్రాలు ఓ కన్నేసి ఉంచాయి. ఏ క్షణాన్నైనా భారత్ లోకి ఒమిక్రాన్ మహమ్మారి ఎంటర్ కావచ్చని అప్రమత్తమవుతున్నాయి. ఆ భయాందోళనలకు తగ్గట్టుగానే తాజాగా నేడు మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.
28 దేశాలను గడగడలాడిస్తోన్న ఈ వేరియంట్ తాజాగా భారత్ లోకి అడుగుపెట్టింది. కర్ణాటకలోని బెంగుళూరులో తొలి ఒమిక్రాన్ కేసు గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులో 44 ఏళ్లు, 66 ఏళ్ల వయసుగల ఇద్దరు వ్యక్తులు ఒమిక్రాన్ బారిన పడ్డారని తెలిపింది. అయితే, ఒమిక్రాన్ గురించి పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉందని, ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని సూచించింది. కానీ, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని సూచించింది.
ఇక, హైదరాబాద్ లోనూ ఒమిక్రాన్ కలకలం రేగింది. యూకే నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చినవారికి టెస్టులు చేయగా…35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. కానీ, అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అని నిర్ధారణ చేసేందుకు 3 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఆమెకు హైదరాబాదులోని టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె శాంపిల్స్ ను జెనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆమెది రంగారెడ్డి జిల్లా అని, ఆమెతో పాటు వచ్చిన ఆమె బంధువుకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే రూ. వెయ్యి ఫైన్ విధిస్తామన్నారు. మాస్కు ధరించకకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆత్మహత్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ బారిన పడిన రిస్క్ దేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన 239 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని, కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నామని అన్నారు.