గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలపై సునామీలా విరుచుకుపడిన ఈ మహమ్మారి వైరస్ వేవ్ ల మీద వేవ్ లతో తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో పాటు ప్రజల్లో కరోనా పట్ల కొంత అవగాహన రావడంతో కరోనా కోరల్లో నుంచి ప్రపంచం కొద్దికొద్దిగా బయటపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికాలో తాజాగా బయటపడ్డ మంకీ పాక్స్ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ లో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ వ్యాధి సోకింది. అమెరికాలో 2003 తర్వాత ఇదే తొలి మంకీ పాక్స్ కేసు అని అధికారులు వెల్లడించారు. ఇటీవల నైజీరియాకు వెళ్లి వచ్చిన ఆ వ్యక్తిలో వైరస్ ను గుర్తించారు. అయితే, ఈ వ్యాధి ప్రమాదకరం కాదంటూనే…ఆ వ్యాధిపట్ల అత్యంత అప్రమత్తతగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారిలో లక్షణాలేమన్నా ఉన్నాయేమో తెలుసుకునే పనిలో అధికారులున్నారు.
మరోపక్క కరోనా పుట్టినిల్లు చైనాలో మంకీ బీ వైరస్ మరింత ఆందోళన కలిగిస్తోంది. చైనాలో మంకీ బీ వైరస్ బారినపడి ఓ వెటర్నరీ డాక్టర్ కన్నుమూశాడు. ఈ ప్రాణాంతక వైరస్ సోకిన తొలి మానవ కేసు ఇదేనని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అయితే, ఆ డాక్టర్ తో కలిసిమెలిసి తిరిగిన వారు సురక్షితంగా ఉన్నారని, వారికి వైరస్ సోకలేదని వెల్లడించింది.
నాన్-హ్యూమన్ ప్రైమేట్లపై పరిశోధన చేస్తున్న సంస్థలో ఆ వెటర్నరీ డాక్టర్ పనిచేస్తున్నాడని, ఆ సందర్భంలోనే మంకీ బీవీ వైరస్ బారినపడ్డాడని తెలుస్తోంది. వికారం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడుతున్న అతడు చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. అతడు మే 27న మరణించగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా, ఈ రెండు వైరస్ ల పట్లా మిగతా దేశాలు కూడా అప్రమత్తంగా ఉండక తప్పదు.