లేదు లేదంటూనే కరోనా మరింత విజృంభిస్తోంది. కరోనా అయిపోయిందని.. ఇక, లాక్డౌన్ ఎందుకు? అనే వారికి హెచ్చరికగానా? అన్నట్టుగా.. తాజాగా ఏపీలో డెల్టా ప్లస్ కేసు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు గుర్తించామని మంత్రి తెలిపారు. బాధితునికి చికిత్స కూడా పూర్తైందని ఆయన అన్నారు. నిజానికి ఇప్పటి వరకు కరోనా డెల్టా వేరియంట్ కారణంగా సెకండ్ వేవ్‌లో వేలాది మంతి ప్రాణాలు కోల్పోయారు.
వేల టన్నుల ఆక్సిజన్ అవసరం అయింది. ఆక్సిజన్ అందక.. వేలాది మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే నిపుణులు మరిన్ని వేరియంట్లు వస్తాయని హెచ్చరించారు. అయితే.. డెల్టా ప్లస్ వేరియంట్ మనకు రాదని.. ఇక్కడ అలాంటి వాతావరణం లేదని.. మన రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది. అయితే.. తాజాగా తిరుపతి వ్యక్తికి.. వచ్చిన కరోనా సింప్టమ్స్‌ను పరిశీలించిన తర్వాత.. అది డెల్టా ప్లస్సేనని వైద్యులు నిర్ధారించారు. దీనికి చికిత్స కూడా అందించారు. ఇక, సదరు వ్యక్తితో ఎవరు కాంటాక్ట్ అయ్యారనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై చర్చించామని.. లాక్డౌన్ అంశంపై ఈ నెల 30న నిర్వహించే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాని పేర్కొన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అయితే.. తిరుపతిలో వచ్చిన కేసు నేపథ్యంలో ఇది మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఉంటుందని వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి డెల్టా ప్లస్ ఇంకెంతమంది ప్రాణాలను బలితీసుకుంటుందో చూడాలి.