ప్రపంచంలోనే అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా ఎన్నికై సంచలనంగా మారిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ గురించి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమెకు సంబంధించిన పొలిటికల్ వార్తలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఆమె ప్రభ మసకబారటం తెలిసిందే. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితంలోనూ కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నతనం నుంచి తెలిసిన వ్యక్తితో ప్రేమలో పడి.. కొన్నేళ్లు సహజీవనం చేసి.. పెళ్లి చేసుకున్న ఆమె.. మూడేళ్లకే భర్త నుంచి విడిపోతున్న విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓడిన ఆమె.. ప్రస్తుతం అపద్ధర్మ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.
వ్యాపారవేత్త.. మాజీ ప్రొఫెషనల్ పుట్ బాల్ ఆటగాడైన మార్కస్ రైకోనెస్ తో విడిపోతున్న విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు రూపంలో ప్రకటించారు. ‘‘మేమిద్దరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. చిన్నతనం నుంచి కలిసి పెరిగాం. పందొమ్మిదేళ్లు కలిసే ఉన్నాం. ఇప్పటికి మేమిద్దరం మంచి స్నేహితులమే. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. కుటుంబంగా మా కుమార్తె కోసం టైంను వచ్చిస్తాం’ అని పేర్కొన్నారు. 2020లో వీరి పెళ్లి అనంతరం.. వీరి బంధానికి గుర్తుగా ఆమె కుమార్తెకు జన్మనిచ్చారు.
సనా రాజకీయ జీవితానికి వస్తే 2019లో ఆమె ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 34 ఏళ్ల పిన్న వయసులో ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కొవిడ్ వేళ.. యావత్ ప్రపంచం భయాందోళనల్లో మునిగిన వేళ.. ఆమె తీసుకొచ్చిన కొత్త విధానాలు ఐరోపా సమాఖ్యతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. కాకుంటే..వ్యక్తిగతంగా ఆమె పార్టీల్లో పాల్గొనటం.. ప్రజాధనాన్ని వ్యయం చేసిన తీరుతో విమర్శల బారిన పడ్డారు. దీంతో ఆమె పాపులారిటీ తగ్గింది. దీంతో.. తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆమె అపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఓటమిపాలు కాగా.. కన్జర్వేటివ్ పార్టీ విజయాన్ని సాధించింది. త్వరలోనే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి వేళలోనే ఆమెతన విడాకుల విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ప్రధాని పదవిలో ఉన్న వేళలోనే పెళ్లి చేసుకున్న ఆమె.. ప్రధానిగా కొనసాగుతున్న సమయంలోనే విడాకుల వరకు వెళ్లటం గమనార్హం.