రాజకీయాలు అన్ని చోట్లా చేయడానికి వీల్లేదు. నాయకులుగా ప్రజలు గెలిపించినంత మాత్రాన పూర్తిస్థాయిలో వారికి ఆధిపత్యం ఇచ్చేసినట్టు కాదు. అదే ప్రజాస్వామ్యం గొప్పదనం. ప్రతి ఐదేళ్లకు ఒకసారి `మార్చేసే` అనే మంత్ర దం డం ప్రజల చేతిలోనే ఉంది. దీనిని గుర్తు పెట్టుకున్న నాయకులు ఎక్కువ కాలం ప్రజల మధ్య విజయం దక్కించు కున్నారు. అధికారంలోకి వచ్చారు. మరిచిపోయిన.. జగన్ వంటి వారు చతికిల పడ్డారు. మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ రాజకీయం చేయాలో.. అక్కడే చేయాలి అన్న సూత్రం బలంగా వినిపిస్తోంది.
2021-22 మధ్య కాలంలో సీఎంగా ఉన్న జగన్.. సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు ఒప్పుకోలేదు. అదే సమయం లో కొత్త సినిమాలకు బెనిఫిట్ షో వేసుకునేందుకు కూడా అంగీకరించలేదు. ఈ పరిణామం అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. దీంతో మెగా స్టార్ చిరంజీవి, రాజమౌళి, మహేష్‌బాబు, ప్రభాస్ వంటి దిగ్గజాలు సీఎం జగన్ వద్దకు వచ్చి పంచాయతీ పెట్టారు. అక్కడ ఏం జరిగిందో ఏమో.. చివరిలో చిరంజీవి రెండు చేతులు జోడించి.. జగన్‌కు నమస్కారం పెట్టడం.. “మీరు మాకు తల్లివంటి వారు“ అని ఆయన చెప్పడం మాత్రం జోరుగా వైరల్ అయింది.
ఈ వీడియో బిట్‌ను ప్రభుత్వమే రిలీజ్ చేసింది. అయితే.. దీనివల్ల జగన్ ఆశించింది.. ఫక్తు రాజకీయం. కానీ, ఆయన చెడగొట్టుకున్నది కూడా ఈ రాజకీయమే. చిరంజీవి అంతటి వాడు .. తనకు చేతులు జోడించాడంటే.. తాను ఎంత గొప్పో చూడండి అన్నట్టుగా జగన్ కుర్చీలో ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. కానీ, చిరు అభిమానులే కాకుండా.. సినీ రంగానికి చెందినవారు కూడా..జగన్ తెంపరితనం చూడండి! అని విమర్శలు చేసుకున్నారు. చివరకు ఇది ఎన్నికల్లో ఓటమికి దారితీసింది. ఆయన అహంభావానికి ప్రచారం కల్పించింది.
సరే.. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి రికార్డును సొంతం చేసుకున్న చంద్రబాబు అనుసరించిన వైఖరి కారణంగానే చెప్పాల్సివస్తోంది. వరద బాధితులకు సాయం చేసేందుకు సినీరంగానికి చెందిన వారు క్యూకట్టారు. వీరిలో చిన్నా పెద్దా నటులు అందరూ ఉన్నారు. చంద్రబాబు అందరినీ ఒకేలా రిసీవ్ చేసుకున్నారు. ఆయన చేతులు కట్టుకుని కుర్చీలో కూర్చోలేదు.
కూర్చున్న కుర్చీ నుంచి దిగి బయటకు వచ్చి.. వారిని పలకరించి.. వారి బాగోగులు తెలుసుకుని.. వారి నుంచి చెక్కులు తీసుకున్నారు. ఎంతో వినయంగా.. ఎంతో విధేయతగా వారు కాదు.. చంద్రబాబే వ్యవహరించారు. ఇదీ.. రాజకీయం!! అందుకే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతోంది. ఈ తేడా తెలుసుకుని ఉంటే..జగన్ కు కూడా మార్కులు పడేవని అంటున్నారు పరిశీలకులు.