ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భూమి పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇకపై మంగళగిరి నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని జనసేనాని ఫిక్స్ అయ్యారు. ఈ నేపద్యంలోనే ఆఫీస్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించారు.
మరోవైపు, జూన్ 14 నుంచి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ధర్మయాగం కూడా చేపట్టారు. నిన్న మొదలైన యాగం నేడు కూడా కొనసాగుతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షతో దేవతామూర్తులకు పూజలర్పించారు.
ఈ సందర్భంగా పవన్ ధర్మయాగం నిర్వహించిన యాగశాలను టాలీవుడ్ సినీ ప్రముఖులు సందర్శించారు. దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, నిర్మాత డీవీవీ దానయ్య, సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్, నిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పూజల అనంతరం పవన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వారాహి వాహనం వివరాలను పవన్ ను అడిగి తెలుసుకున్నారు. వారాహి వాహనం విజయాలను అందిస్తుందని, ఆ వాహనంపై సమరాన్ని ఆరంభించే సాహసి వస్తున్నాడని, ఆయనకు విజయాలు కలగాలని సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.