30, 40 ఏళ్ల వయసుల్లో ఉన్న వాళ్లు.. ఆరోగ్యంగా కనిపించే వాళ్లు హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఆరోగ్యకరం కాని, ఆధునిక జీవన శైలే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయాయం చేయకపోవడం వల్లే యూత్ కూడా గుండె పోటుకు గురవుతున్నారని అంటున్నారు వైద్యులు. అలాంటిది ఎంతో ఫిట్‌గా కనిపించే, వర్కవుట్లకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే, ఎంతో ఆరోగ్యంగా కనిపించే పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వర్కవుట్లు చేస్తూనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలుసు కానీ.. వ్యాయామాల్లో తేడాలొస్తే ప్రాణాలే పోతాయా అని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఐతే పునీత్ మృతికి కచ్చితమైన కారణం అంటూ ఇంకా అధికారిక సమాచారం ఏదీ బయటికి రాలేదు. ఆయన్ని పరిశీలించి, చికిత్స చేసిన వైద్య నిపుణులు ఏమంటారో చూడాలి. ఐతే ఈలోపు కొందరు వైద్యులు దీని మీద విశ్లేషణలు చేస్తున్నారు. పునీత్ కుటుంబంలో అతడి తండ్రి, అన్నదమ్ము గుండె సంబంధిత సమస్యలున్న నేపథ్యంలో అతను జాగ్రత్త పడాల్సిందని, అలాగే ముందు రోజు రాత్రి ఒంట్లో నలతగా అనిపించినపుడు వర్కవుట్లకు దూరంగా ఉండాల్సిందని అంటున్నారు.
అలాగే పునీత్ పరిమితికి మించి బరువులు మోయడం వల్ల రక్త నాళాల మీద ఒత్తిడి పడి ఉండొచ్చని అంటున్నారు. దీన్ని బట్టి తెలిసిందేమంటే.. ఏం చేసినా శరీరం తట్టుకునే వరకు, ఒక పరిమితి మేరకే చెయ్యాలి. తమ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరచాలని శ్రుతి మించి పోకూడదు. మన తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, కార్తికేయ.. ఇలా చాలామంది హీరోలు బాడీ బిల్డింగ్ కోసం విపరీతంగా శ్రమించిన వాళ్లే. అందరూ తమ లుక్‌తో ఆశ్చర్యపరిచిన వాళ్లే. కానీ పునీత్ అనుభవం నేపథ్యంలో ఇకముందు మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిందే. కొంచెం పరిమితులు పెట్టుకోవాల్సిందే. మన హీరోలు ఎలా ఉన్నా జనాలు వాళ్ల సినిమాలను చూస్తార్న విషయం గుర్తుంచుకోవాల్సిందే.