ఇలా ఖాళీ అయిందో లేదో.. అలా నాయకులు క్యూ కట్టేశారు. అదే.. హాట్ సీట్ మంగళగిరి. వరుసగా ఈ నియోజకవర్గంలో వైసీపీ పాగా వేస్తున్న విషయం తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. 2014లో కేవలం 25 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్న ఆళ్ల.. తర్వాత 2019లో 25 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక, ఇప్పుడు అనూహ్యంగా ఆయన పార్టీకి, తన శాసన సభ సభ్యత్వానికికూడా రాజీనామా చేశారు.
ఆయన ఇలా రాజీనామా చేశారో.. లేదో.. ఇంకా ఆ రాజీనామా ఆమోదం పొందిందో లేదో కూడా తెలియకుండానే నాయకులు ఈ సీటు కోసం కర్చీఫ్ పరిచేశారు. మేమంటే మేమే ఆ సీటు నుంచి పోటీ చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. వీరిలో 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి, ఆళ్లపై పరాజయం పాలైన గంజి చిరంజీవి, అదేవిధంగా కొన్నాళ్ల కిందట వైసీపీ తీర్థం పుచ్చుకున్న కాండ్రు కమల ఉన్నారు. ప్రస్తుతం గంజి చిరంజీవి కూడా వైసీపీలోనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఇద్దరూ కూడా అధిష్టానం మెప్పుకోసం ఎదురు చూస్తున్నారు.
గంజి చిరంజీవి ఏకంగా అధిష్టానం ఈ సీటును తనకే ఇస్తుందని తేల్చి చెబుతున్నారు. అందుకే పార్టీ మారానని, బీసీలకు కేటాయిస్తానని సీఎం జగన్ అప్పట్లోనే హామీ ఇచ్చారని.. కాబట్టి తనదేనని అంటున్నారు. ఇక, కాండ్రు కమల కూడా.. ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటున్నారు. అంతేకాదు.. ఆళ్లపై ఆమె తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. “ఆళ్ల గెలిచాక ఒక నెల మాత్రమే మాతో సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత కార్యక్రమాలకు మమ్మల్ని దూరం పెట్టారు. పార్టీ పరువు తీయకూడదనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా“ అని కమల వ్యాఖ్యానించారు.