టీడీపీ తరఫున 2019 ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ తర్వాత గోడ దూకి వైసీపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, చాలాకాలం నుంచే గన్నవరంలో ఆల్రెడీ వైసీపీ నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు, వల్లభనేని వంశీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గన్నవరంలో తాను ముందు నుంచి వైసీపీ నేతగా ఉన్నానని వెంకట్రావు అంటుండగా…తాను జగన్ చెప్పినట్లు నడుచుకుంటున్నానని వంశీ అంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఇద్దరు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వెంకట్రావు అంటుంటే…ఆ టికెట్ తనకు ఖాయమని వంశీ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జగన్ మద్దతు తనకేనని, తాను గెలిచినా ఓడినా గన్నవరంలోనే ఉన్నానని, అప్పుడప్పుడు వచ్చిపోయేవారి గురించి తాను అస్సలు పట్టించుకోనని అన్నారు. ఎవరికి సీట్ ఇవ్వాలో జగన్ నిర్ణయిస్తారని, జగన్ పనిచేయాలని సూచించారని, తాను చేస్తున్నానని చెప్పారు. మిగతా వారి గురంచి పార్టీనే చూసుకుంటుందన్నారు
ఈ క్రమంలోనే తాజాగా గన్నవరం వైసీపీలో వర్గ పోరు మరోసారి భగ్గుమంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. వరలక్ష్మీ వ్రతం ప్రభల ఊరేగింపు సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వల్లభనేని వంశీ ఆఫీసు ఎదురుగా ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. యార్లగడ్డ వర్గీయులే దాడి చేశారని వంశీ వర్గీయుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
మరి, గన్నవరం వ్యవహారంపై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, వెంకట్రావు టీడీపీలో చేరతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ ప్రచారాన్ని వెంకట్రావు ఖండించారు.
Comments 1