జగన్ పాలనలో పలువురు ఐఏఎస్ లు, అధికారుల తీరుపై హైకోర్టు గతంలో చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హైకోర్టు గతంలోనే పలుమార్లు హెచ్చరించింది. అయితే, కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు తీరులో మార్పు రాకపోవడంతో గతంలో పలు సందర్భాల్లో ఐఏఎస్ అధికారులకు కొద్ది రోజుల పాటు జైలు శిక్ష విధించడం, జరిమానా విధించడం వంటి ఘటనలు సంచలనం రేపాయి.
అంతేకాదు, కోర్టుకు ఐఏఎస్ లు హాజరు కాకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద పరిగణించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఆ వ్యవహారాల్లో ఐఏఎస్ ల తప్పేమీ లేదని, కేవలం జగన్ కు నో చెప్పలేకనే వారంతా ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారన్న టాక్ ఉంది. ఇలా, అధికార పార్టీ చెప్పినట్లు వినక తప్పని పరిస్థితుల్లోనే వారు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించడం, ఆ తర్వాత వారు క్షమాపణ కోరడంతో శిక్ష రద్దు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని హితవు పలకడం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఐఏఎస్ ల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల పాపాలకు అధికారులు బలవుతున్నారని, కానీ, ఆ నిర్ణయాల్లో అధికారుల పాత్ర ఏమీ ఉండదని నాగబాబు చెప్పారు. కానీ, పరిస్థితుల వల్ల సమాజానికి, రాజ్యాంగానికి సంరక్షకులు(వాచ్ డాగ్స్)గా ఉండాల్సిన ఐఏఎస్ లు వైసీపీ మాయలో పడిపోయి వైసీపీ (పెట్స్) పెంపుడు కుక్కలుగా మారిపోయారనే పరోక్ష అర్థం వచ్చేలా నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా అధికారులకు ఉదాహరణగా నిలిచేలా వీరిని శిక్షించాలని నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, తాను ఐఏఎస్ లను తప్పుబట్టడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో సచివాలయాలు నిర్మించాలన్న నిర్ణయం వైసీపీ ప్రజాప్రతినిధులదే అయి ఉంటుందని నాగబాబు అభిప్రాయపడ్డారు. కోర్టు శిక్షకు గురైన 8 మంది ఐఏఎస్లు మంచి సమర్థులైన అధికారులేనని, పరిపాలన ఇలా ఉండకూడదనే విషయానికి జగన్ సర్కాే ఉదాహరణ అని అన్నారు.