ఏపీ సీఎం జగన్ తన అపరిపక్వ పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలపై, తెస్తున్న జీవోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లలలో టికెట్ల రేట్ల తగ్గింపుపై ఇచ్చిన జీవో నంబర్ 35ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేయడం చర్చనీయాంశమైంది. ఇక, ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాకిచ్చింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 53, 54లను హైకోర్టు కొట్టివేసింది. ఆ జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యాసంస్థల యాజమాన్యాలు హైకోర్టులో పిల్ వేశాయి. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోలను సవాల్ దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మేనేజ్ మెంట్ల ప్రతిపాదనలు తీసుకుని కొత్త జీవోలను ఇవ్వాలని ఆదేశించింది.
ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారని అభిప్రాయపడింది. ఏపీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు తెలిపింది. తాజాగా హైకోర్టు నిర్ణయంతో జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజును ఖరారు చేస్తూ ఈ ఏడాది ఆగస్టులో జగన్ సర్కార్ జీవో నంబర్ 53,54లు జారీ చేసింది. ఈ ఫీజులు 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని, స్కూల్, కాలేజీ బస్సులుంటే రవాణా చార్జీల కింద అదనంగా వసూలు చేయాలని తెలిపింది.