టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు కిలో మీటర్ల కొద్ది బారులు తీరే ఝంజాటానికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. టోల్‌ప్లాజాల వద్ద క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్ విధానం తప్పనిసరి అంటూ కేంద్రం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి.
2 రోజుల్లోనే 2.5 లక్షల ఫాస్టాగ్ లు అమ్ముడుపోయాయి. దీంతో, ఫాస్టాగ్ కు విపరీమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వాహనదారులకు కేంద్రం తీపికబురు చెప్పింది. మార్చి 1వ తేదీ వరకు ఫాస్టాగ్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇప్పటివరకు ఫాస్టాగ్‌ను కొనాలంటే రూ.100 చెల్లించాలి.
ఆ తర్వాత ఫాస్టాగ్ లో తమకు కావలసినంత నగదును వినియోగదారులు నిల్వ ఉంచుకోవాలి. అయితే, తాజాగా రూ.100 చెల్లించకుండానే మార్చి 1వరకు ఉచితంగా ఫాస్టాగ్ ను అందించనున్నారు. కానీ, కార్డులో మాత్రం వాహనదారులు కావలసినంత డబ్బులు వేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం తాజా నిర్ణయంతో దేశంలోని 770 టోల్‌ప్లాజాల వద్ద ఉచితంగా ఫాస్టాగ్‌ను అందించనున్నారు.
ఫిబ్రవరి 15 తర్వాత తొలి రెండు రోజుల్లోనే 87% వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరిపాయి. 100 టోల్‌ప్లాజాల వద్ద 90% వాహనాలు ఫాస్టాగ్‌తో వెళ్లాయని కేంద్ర రవాణా శాఖ పేర్కొంది. దీంతో, మై ఫాస్టాగ్ యాప్‌లో పలు కొత్త ఫీచర్లనూ అందుబాటులోకి తెచ్చింది. ‘చెక్ బ్యాలెన్స్ స్టాటస్’ ఫీచర్ తో ఫాస్టాగ్‌లో ఉన్న బ్యాలెన్స్ ను వినియోగదారుడు సులభంగా తెలుసుకోవచ్చు.