ఏపీ రాజధాని అమరావతేనని… అమరావతిని 6 నెలలలోపు డెవలప్ చేయాలని కొద్ది నెలల క్రితం ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాము ఆరు నెలల్లోపు డెవలప్ చేయలేమని జగన్ సర్కార్ చేతులెత్తేసింది. తమకు మరింత సమయం కావాలని కోరింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు డబ్బులు లేని జగన్ కు…అమరావతిని అభివృద్ధి చేసేందుకు కూడా డబ్బులు లేవని విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే తాజాగా అమరావతి రైతులు ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు గడపతొక్కారు. హైకోర్టు తీర్పును ధిక్కరించి పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న జగన్ సర్కార్ పై రాజధాని రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజాధనం దుర్వినియోగమవుతోందని, ప్రభుత్వ తీరు వల్ల కొన్ని వందల కోట్ల సంపద నాశనమవుతోందని వారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, రైతులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగబోయే తేదీపై క్లారిటీ లేదు.
కాగా, జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత అమరాతి రాజధాని విషయంలో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగడం ఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేశారు. దీంతో, ఎక్కడి నిర్మాణాలు అక్కడ ఆగిపోయి…పిచ్చి మొక్కలు పెరిగి కొత్త భవనాలన్నీ శిధిలావస్థకు చేరుకున్నాయి.
దీంతో, రైతులంతా నిర్విరామంగా రెండున్నరేళ్ల పాటు ఉద్యమాలు, నిరసనలు, నిరాహార దీక్షలు జరిపి చివరకు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, నిర్దిష్ట గడువులోపు అమరావతి రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతిని డెవలప్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.కానీ, ఇప్పటిదాకా ఆ డెవలప్ మెంట్ కోసం ఏమీ చేయకపోవడంతో రైతులు తాజాగా సుప్రీం తలుపుతట్టారు.