తీసుకున్నది పది వేల రుణం. అది కూడా పంట రుణం. తీర్చలేదనే ఆగ్రహంతో బ్యాంకు అధికారులు ఏకంగా రైతుల ఇళ్లకు తాళాలు వేసేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోనే జరిగింది. దీంతో కేసీఆర్ పదే పదే చెప్పే రైతు రాజ్యం ఇదేనా? అంటూ.. అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సార్‌కి ఇది కనిపించడం లేదా? అని నిలదీస్తున్నారు.
ప్రస్తతుం కరోనా కాలం. ఆపై చలి. చిన్న పిల్లలతో ఆ రైతులు రాత్రంతా బయటే ఉన్నారు. తినడానికి తిండీ లేదు. కప్పుకోవడానికి కనీసం దుప్పట్లు లేవు. రోజులాగే పనులకు చేనుకు వెళ్లిన సమయంలో బ్యాంకు అధికారులు వచ్చి వారి ఇళ్లకు తాళాలు వేశారు. ఏం చేయాలో తెలియక అయోమయమైన ఆ అన్నదాతలు.. రాత్రంతా చలిలో బయటే ఉన్నారు. బ్యాంకు అధికారుల తీరుపైనా, కేసీఆర్ సర్కారుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లి, బర్లగూడెంలో… డీసీసీబీ అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణం కట్టలేదని… ఇళ్లకు తాళాలు వేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు మిర్చి పంటకు తామర పురుగు ఆశించి పంట దెబ్బతింటే… బ్యాంకు అధికారులు రుణాలు కట్టాలంటూ ఇళ్లకు తాళాలు వేసి వేధిస్తున్నారని వాపోతున్నారు.
గ్రామంలో నలుగురు రైతుల ఇళ్లను బ్యాంకు అధికారులు సీజ్ చేయడంతో… కొవిడ్ వేళ ఎవ్వరూ ఇంటికి రానివ్వకపోవడంతో… రాత్రి ఇళ్ల ముందే చలిలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని కంటతడి పెట్టుకున్నారు. కొందరు కౌలు రైతులు రెండు, మూడేళ్ల క్రితం డీసీసీబీ నందు రూ.10వేల చొప్పున రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించకపోవడంతో.. బ్యాంకు అధికారులు పలుమార్లు వారికి నోటీసులు జారీ చేశారు. తీసుకున్న రుణం కట్టనివారి ఇళ్లకు తాళాలు వేశారు.
కరోనా కాలంలో ఉన్నఫళంగా ఇంటికి తాళాలు వేయడంతో… పిల్లలు తిండి లేక పస్తులతో పడుకున్నారని.. ఓ మహిళా రైతు కన్నీటిపర్యంతం అయ్యారు. కొందరు బాధితులు పొలాలకు వెళ్లిన సమయంలో… తాళాలు వేయడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. “మేం లోన్ తీసుకున్నం. కొంత కట్టినం. కొంత ఆగినయ్. మేం ఇంటి దగ్గర లేని సమయంలో తాళం వేసి పోయారు.
అన్నం లేదు ఏం లేదు. ఈ చలిలో బయట పడుకున్నాం. పిల్లలు చలికి అల్లాడిపోయారు. సగం ఆగితేనే ఇంత దారుణంగా చేస్తారా? అసలే కరోనా టైం. చిన్న పిల్లలు ఉన్న మమ్మల్ని ఇలా చేస్తారా? కేసీఆర్ సార్‌కు ఇది న్యాయమేనా?“ అని ఒక మహిళా రైతు కన్నీటి పర్యంతమైంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు అన్నదాతలు.