కేంద్రం చేసిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రెండుపార్టీలతోను చర్చించేందుకు సుప్రింకోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటి నుండి ఒక సభ్యుడు తప్పుకున్నారు. కమిటిలో తాను సభ్యునిగా ఉండదలచుకోలేదని భూపేందర్ సింగ్ మన్ స్పష్టం చేశారు. సుప్రింకోర్టు నియమించిన నలుగురు సభ్యుల్లో భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ మన్ కూడా ఒకరు. సుప్రింకోర్టు కమిటిని నియమించగానే రైతులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
కమిటిలోని సభ్యులంతా గతంలో నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చిన వాళ్ళే అంటూ రైతుసంఘాల నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అంటే రైతులకు తమపై నమ్మకం లేనపుడు ఇక కమిటిలో కంటిన్యు అవటంలో ఉపయోగం లేదని మన్ కు అనిపించినట్లుంది. అందుకనే కమిటిలో చోటు కల్పించినందుకు సుప్రింకోర్టుకు ధన్యవాదాలు చెబుతునే కమిటిలో నుండి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు.
కమిటిలో నుండి తప్పుకున్న తర్వాత మన్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను తాను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం తాను ఎటువంటి త్యాగాలు చేయటానికైనా వెనకాడేది లేదన్నారు. రైతుల అభిప్రాయాలను తాను గౌరవిస్తున్న కారణంగానే స్వచ్చంధంగా తాను కమిటిలో నుండి పక్కకు తప్పుకున్నట్లు వివరించారు. తాను కూడా ఓ రైతునే అని, రైతుసంఘం నేతగా తనను తాను మన్ అభివర్ణించుకున్నారు.
కమిటిలో నుండి మన్ తప్పుకోవటంతో మిగిలిన సభ్యులు వ్యవసాయ ఆర్ధికవేత్త అశోక్ గులాటి, షేట్కారి సంఘటన్ అధ్యక్షుడు అనీల్ ఘన్వత్, ఇంటర్నేషన్ ఫుడ్ పాలసీ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ కు చెందిన ప్రమోద్ కుమార్ జోషిలు ఏమి చేస్తారో చూడాలి. ఎందుకంటే కమిటిలో సభ్యులపై తమకు నమ్మకం లేదని రైతుసంఘాలు తెగేసి చెప్పారు. ఆ మాటకొస్తే అసలు కమిటి వేయటమే కేంద్రప్రభుత్వానికి కూడా ఇష్టంలేదు. ఆ విషయాన్ని సొలిసిటర్ జనరల్ నేరుగా విచారణ సందర్భంగానే చెప్పేశారు. కాకపోతే కోర్టు నచ్చ చెప్పిన తర్వాత కమిటి ఏర్పాటుకు అంగీకరించారు.