ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచింది. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్న శాసన సభలో ప్రవేశపెట్టారు. 62 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిందని, రైతుల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. రైతులను గత ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసి పంట బీమా కూడా ఇవ్వలేదని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు.
మరోవైపు, ఈ బడ్జెట్ (డిసెంబరు-మార్చి-2024-25)లో జలవనరుల రంగానికి పెద్ద పీట వేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నాలుగు మాసాల కాలానికి ఏకంగా 16739 కోట్లరూపాయలను జలవనరుల విభాగానికి కేటాయించింది. తద్వారా రాష్ట్రంలోని సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అయింది. ఇదేసమయంలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు కూడా సర్కారు ఎక్కువగానే ప్రాధాన్యం ఇచ్చింది.
పాఠశాల విద్య ప్రోత్సాహం, పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు ఏకంగా 29 వేల 909 కోట్ల రూపాయల ను ప్రకటించింది. ఇది కూడా భారీ నిధులను కేటాయించినట్టే అయింది. తద్వారా.. ఎన్నికలకు ముందు చెప్పిన మాతృవందనం పథకానికి జీవం పోసినట్టు అయింది. అయితే.. దీనిని నేరుగా ప్రస్తావించకపోయి నప్పటికీ.. ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా బడ్జెట్లో రైతులు, విద్యకు ఎక్కువగా ప్రాదాన్యం ఇవ్వడం గమనార్హం.
వ్యవసాయ బడ్జెట్ :
వ్యవసాయ శాఖ – రూ.8,564.37 కోట్లు
భూసార పరీక్ష – రూ.38.88 కోట్లు
రాయితీ విత్తనాలు – రూ.240 కోట్లు
విత్తనాల పంపిణీ – రూ.240 కోట్లు
ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది కార్యక్రమం – రూ.11.31 కోట్లు
పంటల బీమా – రూ.1,023 కోట్లు
ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
డిజిటల్ వ్యవసాయం – రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68 కోట్లు
ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ – రూ.44.03 కోట్లు
వడ్డీ లేని రుణాలు – రూ.628 కోట్లు
అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు
రైతు సేవా కేంద్రాలు – రూ.26.92 కోట్లు