ఏలూరు జిల్లాలో సంచలన విషయం వెలుగు చూసింది. టీడీపీకి మద్దతుగా ఉన్నారనే కారణంగా.. గౌడ కుల సంఘం ఓ గొర్రెల కారపి కుటుంబాన్ని వెలి వేసింది. దీనిని అధికారికంగా కూడా.. సంఘం ప్రకటించింది. ఇటీవల కాలంలో సంఘాలను ఏకం చేస్తున్న వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా ఉంటే నిధులు ఇస్తామని.. ప్రతికూలంగా ఉంటే మీ ఇష్టమని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో గౌడ సంఘం.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో వీరంకి లక్ష్మయ్య గౌడ్ అనే ఒక గొర్రెల కాపరి కుటుంబంపై సామాజిక బహిష్కరణ(వెలి) విధిస్తున్నట్టు గౌడ సంఘం నాయకులు ప్రకటించారు. దీనికి సంబందించిన ఆదేశాలను వాట్సాప్లో పోస్టు చేశారు. సదరు కుటుంబం టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుండడమే కారణమని.. కుటుంబానికి అండగా ఉంటున్నవారు చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సుమోటో గా కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ప్రజా సంఘాలు ఉద్యమాలకు రెడీ అయ్యాయి.
ఇదిలావుంటే.. ఈ కుటుంబానికి అనుకూలంగా, ప్రతికూలంగా మారిన రెండు వర్గాలు కలెక్టర్ కార్యాలయా నికి చేరుకుని పోటా పోటీగా నిరసన చేపట్టాయి. బాధిత మహిళ కుటుంబానికి అండగా ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న దెందులూరు గౌడ సంఘం నాయకులు దీనిపై చర్యలకు పట్టుబడుతున్నారు. వీరికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. అయితే బాధిత మహిళ కోసమే తమ పోరాటం అంటూ మరోవైపు ఇంకో వర్గం ర్యాలీకి సమాయత్తమైంది. దీనికి వైసీపీ నాయకులు అండగా ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.