తెలుగు తేజం, న్యాయ కోవిదులు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. సీజేఐ అయిన తర్వాత ఏపీకి తొలిసారిగా వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్ మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. సీజేఐకి తేనీటి విందు ఇచ్చిన జగన్…ఆయనతో పలు విషయాలపై ముచ్చటించారు. గతంలో, జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ లేఖ రాసిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే.
ఇక, తాజాగా నేడు హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్ అసోసియేషన్ లు సంయుక్తంగా సీజేఐ ఎన్వీ రమణకు సన్మానం చేశాయి. సతీసమేతంగా జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైకోర్టుకు వస్తున్న సమయంలో సీజేఐ ఎన్వీ రమణకు మార్గమధ్యలో అమరావతి రైతులు పూలుజల్లి ఘన స్వాగతం పలికారు. సన్మానం అనంతరం సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీజేఐ అయిన తర్వాత ఏపీకి ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చారు.
కోవిడ్ ప్రభావం వల్ల ఏపీకి తెలుగు రాష్ట్రాలకు రాలేకపోయానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తన మీద తెలుగు రాష్ట్ర ప్రజలు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులని, సమాజాన్ని నడిపించాలని హితవుప పలికారు. అన్ని హైకోర్టులలో న్యాయమూర్తుల కొరత ఉందని, ఆ లోటు త్వరలోనే తీరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ పీఎస్. నర్సింహా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.