రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా జరుగుతోన్న జల వివాదంలో లెక్కలేనన్ని సందేహాలు ఉన్నాయి. రోజుకో కొత్త సందేహం వస్తున్నా వీటికి ఆన్సర్ చేసేవారే లేరు. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తుంటే ఇదంతా పెద్ద డ్రామానా ? అన్న సందేహాలు కూడా కలగక మానవు. నిన్న మొన్నటి వరకు ముద్దులు, కౌగిలింతలు పెట్టుకున్న వాళ్లు నేడు జలవివాదం సాక్షిగా తలోరకంగా విమర్శ చేస్తుంటారు.
సొంత ఇంట్లో ఉన్నోళ్లు కూడా అక్కడ ప్రాంత ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మాట్లాడుతుంటారు. ఉదాహరణకు షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ – జగన్ ఉమ్మడి శత్రువును ఓడించేందుకు చేతులు కలుపుతారు అని అన్నారు. అది చంద్రబాబు గురించే అయితే ఈ రోజు అదే షర్మిల తన అన్నకు ఎందుకు వ్యతిరేకమయ్యారు ? అన్నతో కూర్చొని రెండు నిమిషాలు మాట్లాడుకుంటే సరిపోదా ? అన్న ప్రశ్నకు ఏమని ఆన్సర్ చెపుతుందో ? తెలియదు.
ఇక జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిప్పులు చెరగడంతో పాటు సీఎం చంద్రబాబు తనపై ఉన్న కేసుల కోసం రాజీపడే ఏపీని ఎడారి చేస్తున్నారంటూ మండిపడ్డారు. తర్వాత అదే జగన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్ష కూడా చేశారు. కట్ చేస్తే ఆయన సీఎం అయిన వెంటనే కాళేశ్వరానికి ప్రత్యేక హెలీకాఫ్టర్లో వెళ్లి మరీ ప్రారంభోత్సవం చేసి వచ్చారు. అప్పుడు జగన్కు ఏపీ ప్రయోజనాలు కనపడలేదా ? అంటే ఆన్సర్ లేదు.
ఆ తర్వాత జగన్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఏపీ ప్రయోజనాల విషయంలో ఎంతో ఉదారంగా ఉన్నారని.. అలాంటప్పుడు ఆయనతో ఎందుకు కయ్యం పెట్టుకోవాలంటూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. ఇక కేసీఆర్ మీడియా సమావేశంలో సైతం విలేకర్లతో మీరు మా ఇద్దరి మధ్య కయ్యం పెట్టేందుకు కాచుకుని ఉన్నారా ? అని మండిపడ్డారు.
కేసీఆర్ ఏపీ పర్యటనలో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని చెప్పారు. ఆ టైంలో అబ్బ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బంధం ఇలా ఉంటే మనకు కావాల్సింది అంతకన్నా ఏముంటుంది అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే సీన్ మారిపోయింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం జగన్ను, సీమ ఎత్తిపోతల పథకాన్ని టార్గెట్ చేస్తూ కత్తులు దూయడం ప్రారంభించింది.
ఇక ఏపీ వాళ్లు ఆ రేంజ్లో కౌంటర్లు ఇవ్వడం లేదు. ఇటు జగన్తో పాటు వైసీపీ నేతల ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆయా పార్టీల నేతల మధ్య విమర్శల జోరు మామూలుగా లేదు. యేడాదిన్నరలోనే మిత్రులు, శత్రువులు అయ్యారా ? లేదా దీని వెనక ఏం మతలబు ఉందో ? అర్థం కాదు.
ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ ప్రయోజనాలకు తెలంగాణ ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందన్న వార్తను కేవలం సాక్షి ఏపీ ఎడిషన్లో మాత్రమే వేశారు. దీనిని తెలంగాణ ఎడిషన్లో వేయలేదు. దీంతో జగన్, వైసీపీ వాళ్ల డ్రామాలు బట్టబయలు అవుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక అన్న తీరు ఇలా ఉంటే చెల్లి తీరు మరోలా ఉంది.
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల తెలంగాణకు కావాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోమని చెపుతున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు నిమిషాలు కూర్చొంటే నీటి పంచాయితీ ముగుస్తుందని చెప్పే షర్మిల.. తన అన్నతో రెండు నిమిషాలు కూర్చొని తన ఫ్యామిలీ పంచాయితీని కూడా సెటిల్ చేసుకోవచ్చు కదా ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఏదేమైనా ఓ అన్నా – ఓ చెల్లి రెండు రాష్ట్రాలు.. రెండు ప్రభుత్వాలు.. మధ్యలో కేసీఆర్ ఏం జరుగుతుందో ? ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వీరు ప్రజలకు ఆన్సర్ చేయకపోయినా .. ప్రజలు మాత్రం వీరికి ఖచ్చితంగా ఆన్సర్ చేసేందుకు రెడీగా ఉన్నారు.