ఫేక్ న్యూస్ మనకు మామూలైపోయింది. అయితే.. దీనిని కూడా ఒకటికి రెండు సార్లు చదివితే తప్పో ఒప్పో తెలిసి పోతుంది. ఇంతలో సదరు సంస్థలు ఇది ఫేక్ న్యూస్ అని.. ప్రకటిస్తాయి. తమకు ఈ న్యూస్‌కు సంబంధం లేదని కూడా చెబుతుంటాయి. ఇటీవల గత రెండు రోజులుగా బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి చేసిన ప్రకటన అంటూ.. ఒక ఫేక్ న్యూస్ హల్చల్ చేసింది. బీజేపీ వస్తే.. ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆమె ప్రకటించినట్టు ఈ వార్త దుమ్ము రేపింది. దీంతో రెండు రోజుల తర్వాత.. ఆమె స్వయంగా స్పందిస్తూ.. తాను ఎక్కడా అనలేదని ఖండించారు. అంతేకాదు.. దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఎన్నికల సంఘాన్ని కోరారు.
కట్ చేస్తే.. ఎన్నికల వేళ.. ఇప్పుడు మరో ఫేక్ న్యూస్ సోషల్ మీడియా ను కుదిపేస్తోంది. ఇది మామూలు ఫేక్ న్యూస్ కాదు.. ఫేకుల్లో కెల్లా అతి పెద్ద ఫేక్ న్యూస్ కావడం.. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థ పేరుతోనే రావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అంతేకాదు.. ఈ న్యూస్ కూడా ఏపీలో సర్వే చేసిందని, ఏపీ లో కూటమి సహా వైసీపీ పనితీరు.. ఎన్నిక లమూడ్ను పట్టేసిందని సాక్షాత్తూ సదరు.. సంస్థ లెటర్ హెడ్‌పైనే దీనిని రాసి ప్రచారం చేయడం మరింత విడ్డూరంగా ఉంది. అదే.. ఇంటిలిజెన్స్ బ్యూరో(ఐబీ). ఈ సంస్థ కేంద్రం పరిధిలో పనిచేస్తుంది. అలాంటి సంస్థ ఏపీలో పనిచేసినట్టుగా ఇక్కడి ఎన్నికల నాడిని పట్టినట్టుగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఐబీ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది ఇదే..
“కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరిశీలనలో రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపీ స్వీప్ చేయనున్నట్లు తేల్చింది. వైసీపీ విజయావకాశాలకు కారణం, కూటమి ఓటమికి కారణమయ్యే అంశాలతో నివేదిక రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం వైసీపీ 49-51% ఓట్ షేర్ తో 118-124 సీట్లలో(అసెంబ్లీ) గెలిచి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక ఎన్డీయే కూటమి 41-45% ఓట్లతో 48-51 సీట్లకు పరిమితం కానుంది.“ అని ఈ సర్వే తేల్చింది.
నిజం ఏంటి?
వాస్తవానికి ఐబీ ఇలాంటి నివేదికలు కానీ, ఇలాంటి సర్వేలు కానీ చేసినట్టు గతంలో ఎప్పుడూ వార్తలు రాలేదు. ఒకవేళ ఎన్నికల సమయంలో చేసినా.. కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి అనుకూలంగానే ప్రచారం చేస్తుంది.. నివేదిక కూడా ఇస్తుంది. కానీ, ఒక ప్రాంతీయ పార్టీకి కొమ్ము కాయదు. దీంతో దీనిపై అనేక సందేహాలు, అనుమానాలు ముసురుకున్నాయి. ఇదంతా వైసీపీ చేసిన ఘనకార్యమేనా? అనే చర్చ కూడా సాగుతోంది. కొసమెరుపు ఏంటేంటే.. ఈ నివేదికపై ఎవరి సంతకం లేక పోవడం.