సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అనేక వాదోపవాదాలు..వాయిదాలు పడ్డ తర్వాత ఆగస్టు 25న ఈ పిటిషన్ కు సంబంధించిన తుది తీర్పు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ పిటిషన్ పై తుది తీర్పు సెప్టెంబర్ 15న వెలువరిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. జగన్ తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై కూడా తుది తీర్పు అప్పుడే వెలువరిస్తామని వెల్లడించింది. అయితే, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కోర్టు కొట్టి వేసిందని ఓ వర్గం మీడియా వెబ్ సైట్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యవహారంపై రఘురామ స్పందించారు.
తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసినట్టుగా జగన్ సొంత మీడియా వెబ్సైట్లో తప్పుడు కథనం వచ్చిందంటూ రఘురామ ఆరోపించారు. ఆ క్లిప్పింగ్‌తో సహా న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బెయిల్ రద్దుపై తీర్పు రాకముందే జగన్ మీడియాలో కేసును కోర్టు తిరస్కరించిందని బుధవారం నాడే వెల్లడించడంపై మండిపడ్డారు. అంతేకాదు, ఈ విషయంపై తెలంగాణ హైకోర్టును సంప్రదించే యోచనలో తాను న్యాయ నిపుణులను కూడా కలిసినట్లు వెల్లడించారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఈ విషయంపై ముందుకు వెళతానని రఘురామ స్పష్టం చేశారు.
జగన్ మీడియా ఫేక్ వార్తను ప్రచారం చేసి సోషల్ మీడియాలో గందరగోళం రేపుతోందని రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని రఘురామ డిమాండ్ చేశారు. ఎవరో ఆడిస్తే తాను ఆడుతున్నానని, జగన్ రెడ్డి ఫొటో పెట్టుకుని నరసాపురంలో గెలిచానని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. మోపిదేవి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, తన ఇమేజ్ వల్లే తాను నరసాపురంలో గెలిచానని అన్నారు. ప్రజలకు వినోదాన్నిచ్చే సినిమాలపై ప్రభుత్వ నియంత్రణ సరికాదని, థియేటర్ల టిక్కెట్ ధరలను ప్రభుత్వమే నిర్దేశించడం ఏమిటని ఆయన మండిపడ్డారు.