ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కాకపోవడానికి టీడీపీనే కారణం అంటూ వైసీపీ ఆ నేతలు ఆరోపిస్తుండగా…ఖజానాలో డబ్బులు లేక వైసీపీ డ్రామాలాడుతోందని టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం వంటి నీచమైన తీరు జగన్ డీఎన్ఏలోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలు, జగన్ రెడ్డిల బతుకే ఓ ఫేక్ బతుకని చంద్రబాబు దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని, ఇటువంటి నీచమైన తీరు వైసీపీ నేతల డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. పెన్షన్లు పంపిణీకి టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని అన్నారు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వవద్దని ఎన్నికల సంఘం ఎక్కడా ఆదేశించలేదని గుర్తు చేశారు.
పెన్షన్ల విషయంలో జగన్ రాజకీయ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులను జగన్ ఇబ్బందులు పెడుతున్నాడని, ఇటువంటి పాలకులు అవసరం లేదని ప్రజలు గుర్తించాలని అన్నారు. జగన్ కుట్రలు ఛేదించాలని, ఆ దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను రూ. 4 వేలకు పెంచుతామని, ఆంక్షలు ఎత్తివేసి ఇంటివద్దే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు, పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జిల్లాల కలెక్టర్లతో భేటీ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పెన్షన్ పంపిణీకి అనుసరించాల్సిన విధానాలపై వారితో ఆయన చర్చించారని తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని, ఎండల తీవ్రత నేపథ్యంలో అక్కడ టెంట్లు, తాగునీరు సదుపాయాలు కల్పించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.