ఇప్పుడున్నదంతా ఆన్ లైన్ కాలం. డిజిటల్ ప్రపంచంలో భారీగా వస్తున్న వార్తలు.. విశేషాలన్ని చిన్ని మొబైల్లోకి చొరబడటం.. చూసినంతనే కొన్నింటిని షేర్ చేయాలనిపించేలా ఉండటం మామూలైంది. అయితే.. అలాంటి కిక్ ఇచ్చే అంశాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే..తెలిసి కానీ తెలియక కానీ మనం ఫార్వర్డ్ చేసే వివరాలు తప్పుదారి పట్టించేలా ఉండకూడదు.
తాజాగా అలాంటి పోస్టు ఒకటి వైరల్ గా మారింది. కరోనా పుణ్యమా అని..ప్రపంచంలో ఏ మూలన ఉన్న చిన్ని దేశంలోని వాడికైనా సరే.. వూహాన్ సిటీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతేనా.. అక్కడి ల్యాబ్ కారణంగా ఈ రోజున ప్రపంచం ఎన్ని కష్టాలు పడుతుందో.. ఎన్ని లక్షల మంది మరణించారో అందరికి తెలిసిందే.
అలాంటి ఫేమస్ వూహాన్ నగరానికి.. అందులోని దరిద్రపుగొట్టు ల్యాబ్ ను లింకు చేసేసి.. కమ్మటి వంటకాన్ని వండేశారు. ఆ ల్యాబ్ లో దోమలపై శాస్త్రవేత్తలు విచిత్రమైన ప్రయోగం చేస్తున్నారని.. వయాగ్రాను దోమల్లోకి పంపి వాటి చర్యను గమనించటమే వారి పని అని పేర్కొన్నారు. ఒక శాస్త్రవేత్త పొరపాటు కారణంగా.. ల్యాబ్ లోని దోమలు బయటకు వచ్చేశాయని అంటున్నారు.
అవి కుట్టిన మనుషులు విచిత్రంగా ప్రవర్తించటమే కాదు.. కామ వాంఛతో రగిలిపోతున్నారని.. వారిని అదుపు చేయటం ఇప్పుడో సమస్యగా మారిందని.. కనిపించిన వారందరిపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా కాస్త భయాన్ని.. అంతకు మించిన విస్మయాన్ని రేకెత్తించే కథనాన్ని తయారు చేశారు. ఇలా అయితే.. నమ్మరు కాబట్టి.. పాత ఫోటోల్ని.. ఒక డాక్టర్ వ్యాఖ్యను కూడా జోడించారు.
ఇదంతా వరల్డ్ న్యూస్ డెయిలీ రిపోర్టర్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ప్రచురించింది. అదో చెత్త వెబ్ సైట్. అందులో మోకాలికి.. బోడి గుండుకు లింకు పెట్టేసి వార్తలు రాసేస్తుంటారు. అయితే.. ఇదేమీ తెలీని వారు తమకు అందిన వార్తను సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశారు. చాలామంది ఈ చెత్త స్టోరీని నమ్మేశారు. తెలిసిన వారికి ఫార్వర్డ్ చేశారు. అయితే.. ఈ కథనంలో నిజం లేదని.. అదంతా ఉత్త బోగస్ అన్న విషయం ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.
అంతేకాదు.. ఈ కథనంలో లైంగిక వాంఛతో రగిలిపోయిన పెద్దాయన అంటూ పేర్కొన్న వ్యక్తి అసలు చైనా వ్యక్తి కాదని తేల్చారు. అతను జపాన్ కు చెందిన వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో తన 114 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్యంతో మరణించారు. అలాంటి ఆయన ఫోటోను బద్నాం చేస్తూ.. పక్కదారి పట్టించే ఈ కథనం చాలామందిని ఫూల్ ను చేస్తుంది. మొత్తంగా చెప్పొచ్చేదేమంటే.. ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు. షేర్ చేయొద్దు.