ఈ టెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల పసి పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలాళ్ల వరకు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోందంటే అతిశయోక్తి కాదు. అపరిమిత మొబైల్ డేటా అందుబాటులో ఉండడంతో నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి పడుకోబోయే వరకు కర్ణుడికి కవచకుండలాల్లా… అరచేతికి స్టార్ట్ ఫోన్ అతుక్కునే ఉంటోంది. దీంతో, చాలామంది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇక, చాలామందికి ఫేస్` వాష్ చేయకపోయినా పర్లేదు కానీ….`ఫేస్` బుక్ ఓపెన్ చేయనిదే రోజు ప్రారంభం కాదు. సోషల్ మీడియాలో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టనిదే పొద్దుగడవదు. కొత్త పరిచయాలు, స్నేహితులు, బంధువులతో టచ్ లో ఉండేందుకు ఫేస్ బుక్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అందుకే, ఫేస్ బుక్ సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ యాప్ గా జనం జీవితాలతో పెనవేసుకుపోయింది. అయితే, జనాలలో ఇంతగా పాపులర్ అయిన ఫేస్ బుక్….ఇకపై సరికొత్త పేరుతో పిలిపించుకునేందుకు సిద్ధమైంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పేరు మారింది. ఇకపై ఫేస్బుక్ ప్లాట్‌ఫాంను ‘మెటా’గా పిలవాలని ఫేస్బుక్ యాజమాన్యం నిర్ణయించింది. ఫేస్బుక్ యాజమాన్యం పరిధిలోకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కూడా చేరిన సంగతి తెలిసిందే. అందుకే, గూగుల్ తరహాలో వీటన్నిటినీ ఒకే మాతృ సంస్థకిందరకు తెచ్చేందుకు ఫేస్బుక్ పేరు మారుస్తున్నారట.
ఫేస్బుక్ అనే మాతృ సంస్థను అలాగే ఉంచి ఫేస్బుక్ ప్లాట్‌ఫాంకు కొత్త పేరు పెట్టాలని జూకర్బర్గ్ నిర్ణయించారు. అల్ఫాబెట్ ఇంక్ అనే మాతృ సంస్థ పరిధిలోనే గూగుల్‌కు సంబంధించిన సంస్థలన్నీ పని చేస్తున్నాయి. అదే తరహాలో ఫేస్ బుక్ మాతృ సంస్థ కింద మెటా, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్‌లను చేర్చాలని జుకర్ బర్గ్ నిర్ణయించారట. అయితే, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఫేస్ బుక్ పేరును అలాగే ఉంచి…వేరే పేరును మాతృసంస్థకు పెడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.