తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పై తిరుగబాటు బావుటా ఎగురవేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలోకి దిగారు. ఇక, తనను ధిక్కరించిన ఈటలను ఎలాగైనా ఓడించాలని గులాబీ బాస్ కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. నిన్న పోలింగ్ ముగియడంతో పార్టీలన్నీ గెలుపెవరిదన్న అంశంపై తీవ్ర ఉత్కంఠలో ఉన్నాయి.
ఈ క్రమంలోనే నిన్న జరిగిన పోలింగ్ సరళిపై పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఈ ఉప ఎన్నికలో కారు జోరుకు బీజేపీ బ్రేక్ వేస్తుందని దాదాపు అన్ని సర్వేల్లో వెల్లడైంది. మిషన్ చాణక్య సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్ సర్వేలో షాకింగ్ గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ ఉప ఎన్నికలో బీజేపీకి 55.68 శాతం (+/-3) ఓట్లు వస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. ఇక, అధికార పార్టీ టీఆర్ఎస్ కు 36.56 శాతం (+/-3) ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది. ఇక, కాంగ్రెస్ కు 4.77 శాతం (+/-1), ఇతరులకు 2.99 శాతం (+/-1) ఓట్లు వస్తాయని వెల్లడించింది.
ఇక, ఉప ఎన్నికపై ‘పీపుల్స్ పల్స్’ అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఓటర్లు బీజేపీ వైపే ఉన్నట్టు కనిపించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ల మధ్య ఓట్ల వ్యత్యాసం 7-9 శాతంగా ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది. 20 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమైన ఈటలపై సానుభూతి ఉందని, ఈటల చేసిన ప్రచారం ఆయనకు కలిసొచ్చిందని ఆ సంస్థ చెబుతోంది. ఈటల రాజేందర్ 24వేల ఓట్ల తేడాతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ ల్యాబోరేటరీ అనే సంస్థ అంచనా వేసింది. బీజేపీకి 51% ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 42% ఓట్లు లభించే అవకాశం ఉందని పేర్కొంది.