ఏపీ శాసన సభ సమావేశాలు బాయ్ కాట్ చేస్తామని పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ తరఫున ప్రజా సమస్యలు శాసన సభలో ప్రశ్నిస్తారని గెలిపించిన వైసీపీ సభ్యులు ఇలా సభకు డుమ్మా కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెబుతున్న జగన్ కు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ తప్ప మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరవుతున్నారు. తమ ప్రశ్నలు సభలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రమే సభకు హాజరవుతారు. మిగిలిన సమయంలో హాజరు కారు.
మొదటి రోజు బడ్జెట్ సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులెవరూ హాజరు కారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వైసీపీ సభ్యులు ఉండరు. రేపటి నుంచి సమావేశాల నుంచి జగన్ మిహా మిగతా సభ్యులు తమ ప్రశ్నలు ఉన్నపుడు సభకు వస్తారు. కానీ, శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులంతా హాజరవుతారు. అక్కడ వారికి సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి హాజరవుతున్నారు.
ఓ వైపు బడ్జెట్ సమావేశానికి డుమ్మా కొట్టిన జగన్ తన 11 మంది ఎమ్మెల్యేలతో 10.30కు సమావేశం కాబోతున్నారు. మీడియా ముందు మాక్ అసెంబ్లీ నిర్వహణ, వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడం, సభకు వెళ్లకపోవడం, సభా సమయంలో వైసీపీ సభ్యుల కార్యచరణ వంటి విషయాలపై వారితో జగన్ చర్చలు జరుపుతారట.