ఓర్నీ.. అనేంత దుర్మార్గం అతడి సొంతం. అనాథ శావాల్ని అమ్మేసేటోడన్న దారుణ ఆరోపణను ఎదుర్కొంటున్నాడు ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. అలాంటి వ్యక్తిని బదిలీ చేసిన గంటల్లోనే మరో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా ఎలా నియమిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. దేశ వ్యాప్తంగా తీవ్రఆగ్రహం వ్యక్తమవుతున్న వైద్య విద్యార్థిని గ్యాంగ్ రేప్ ఉదంతంలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న వారిలో ఒకరు సదరు దారుణం జరిగిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్.
రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఉదంతం పుణ్యమా అని ఇంతకాలం నలుగురి నోట్లో నానిన ఆర్జీకార్ మెడికల్ కాలేజీ దుర్మార్గాలు ఇప్పుడు లోకవ్యాప్తంగా మారాయి. ఇదంతా చూస్తే.. పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ సర్కారు ఉందా? లేదా? ఉంటే.. కళ్లు మూసుకొని గుడ్డిగా పాలన చేస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు. బాధిత వైద్యురాలి హత్యాచార నేపథ్యంలో కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ అవినీతి ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయం వెలుగు చూసింది.
బంగ్లాదేశ్ కు అక్రమంగా ఔషధాలు ఎగుమతి చేయటంతో పాటు.. వాడేసిన సిరంజులు.. ఇతర సామాగ్రిని రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకోవటమే కాదు.. చివరకు అనాథ శవాల్ని కూడా వదలకుండా వాటిని కూడా అమ్మేవాడన్న షాకింగ్ నిజం వెలుగు చూసింది. ఇంతకూ ఇంతటి సంచలన అంశాల్ని చెబుతున్న వారెవరు? ఈ విషయాలన్ని ఎలా తెలుసన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. గత ఏడాది వరకు ఇదే కాలేజీలో పని చేసి.. ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గా ఉన్న అక్తర్ అలీ గతంలోనే ఇతగాడి భాగోతాల మీద ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు.
అయినా.. వాటికి చర్యలు నిల్. తాజా పరిణామాల నేపథ్యంలో.. ఇటీవల ఏర్పాటైన సిట్ ఆయన్ను విచారణకు పిలిచింది. ఆయన చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత ఏడాది జులైలో అలీ రాసిన లేఖలో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. విస్మయానికి గురి కాక మానదు. ఇంతకూ ఆ లేఖలో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..
– ఆసుపత్రి ఆస్తుల్ని కాలేజీ కౌన్సిల్ అనుమతులు లేకుండానే లీజుకు ఇచ్చేవాడు.
– ఆసుపత్రికి అవసరమైన పరికరాలు.. ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపేవాడు.
– కోట్లాది రూపాయిల కొటేషన్లను అనర్హులకు కట్టబెట్టేవాడు.
– ప్రతి సరఫరాదారుడు అతడికి 20 శాతం కమిషన్ ఇవ్వాల్సిందే.
– పరీక్షల్లో తప్పిన విద్యార్థుల నుంచి సొమ్ములు తీసుకొనేవాడు.
– అనాథ శవాల్ని కూడా అమ్మేవాడు.
– వాడేసిన సిరంజ్ లు.. సెలైన్ బాటిల్స్.. రబ్బర్ గ్లౌజులు లాంటివి ప్రతి 2 రోజులకు 500 -600 కేజీల వరకు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీ వాసుల సాయంతో రీసైక్లింగ్ చేయించేవాడు.
– విజిలెన్స్ కమిషన్.. ఏసీబీ.. హెల్త్ శాఖలకు ఫిర్యాదు చేయగా.. అప్పట్లో వేసిన విచారణ కమిటీలు అతడ్ని దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. ఈ విషయం నాకెలా తెలుసంటే.. ఆ కమిటీల్లో నేను ఒక సభ్యుడ్ని.
– సందీప్ ఘోష్ భార్య మీదా దారుణంగా దాడి చేసేవాడు.
– డెలివరీ వేళ సిజేరియన్ చేయించుకున్న భార్య మీద పద్నాలుగు రోజుల తర్వాత ఆమెపై తీవ్రంగా చేయి చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైంది.
– మొదట్లో ఇది కుటుంబ వ్యవహారమని స్థానికులు పట్టించుకోలేదు. తర్వాత ఆమె దీన స్థితి చూసి జోక్యం చేసుకున్నారు. వీధి మొత్తం ఏకమైన ఆందోళనకు దిగారు.
– చుట్టుపక్కల వారితో కూడా సక్రమంగా ప్రవర్తించేవాడు కాదన్న పేరు అతనికి ఉంది.