మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవని రేణుకా చౌదరి….అమరావతి రైతులకు మద్దతుగా వచ్చారంటూ కొడాలి నాని అసెంబ్లీలో ఎద్దేవా చేయడం వైరల్ అయింది. ఆ తర్వాత కొడాలి నాని వ్యాఖ్యలపై రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ అని నాని పరువు తీసేలా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి.
తన గురించి అసెంబ్లీలో మాట్లాడి తనకు బోలెడు ఫ్రీ పబ్లిసిటీ నాని తెచ్చారని చురకలంటించారు. రాబోయే ఎన్నికల్లో నాని సొంత నియోజకవర్గం గుడివాడ నుంచి పోటీ చేస్తానని, మున్సిపల్ కార్పొరేటర్ గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశానని, కానీ ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా పోటీ చేయలేదని అన్నారు. గుడివాడలో పోటీ చేస్తే తానే గెలుస్తానని కొడాలి నానిని, మళ్లీ ఎవరు ఎన్నుకోరని చెప్పారు. ఆ కామెంట్స్ చేసిన రేణుకా చౌదరిపై కొందరు వైసీపీ నేతలు కులం పేరుతో విమర్శలు గుప్పించారు. తెలంగాణ నేతకు ఏపీలో పనేంటని కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో ఎక్కడైనా తిరుగుతానని…ఎవడాపుతాడో చూస్తానని సవాల్ విసిరారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఏదైనా మాట్లాడితే కులాల పేరుతో విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, నాలుగేళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీ నుంచి పోటీ చేయాలని ప్రజలు ఆహ్వానిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మరి రేణుకా చౌదరి వ్యాఖ్యలపై వైసీపీ నేతల రియాక్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.