కన్నడ నటి, కర్ణాటక మాజీ కాంగ్రెస్ నేత, మండ్య మాజీ ఎంపీ రమ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిగా గతంలో పనిచేసిన రమ్య…బీజేపీ నేతలపై పదునైన విమర్శలతో విరుచుకుపడేవారు. కన్నడ, తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న సమయంలోనే మండ్య ఎంపీగా ఎన్నికైన రమ్య…అతి తక్కువ కాలంలోనే నాటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీంలో కీలక సభ్యురాలిగా మారారు.
2019 ఎన్నికలకు ముందు జాతీయ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉన్న రమ్య… ‘దివ్యస్పందన’ పేరుతో ట్విటర్ ఖాతా మెయింటెన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై రమ్య ట్వీట్లు వైరల్ అయ్యేవి. దీంతో, రమ్య పేరు నిత్యం వార్తల్లో నిలుస్తుండేది. అయితే, ఏమైందో ఏమో తెలీదుగానీ హఠాత్తుగా రమ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రతిపక్షాల వల్లే తాను పార్టీ వీడుతున్నానని చెప్పారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు రమ్య.
ఈ నేపథ్యంలో తాజాగా తాను చేసిన తప్పు గురించి రమ్య పశ్చాత్తాపపడుతూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. రాహుల్ గాంధీ విషయంలో తాను చేసిన ఒకే ఒక సరిదిద్దుకోలేని ఘోర తప్పిదం వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చిందంటూ రమ్య వ్యాఖ్యానించారు. 2018లో రాహుల్ గాంధీ జర్మనీలోని బుండెస్టాగ్ మ్యూజియంలో పర్యటిస్తున్న ఫొటోలను తాను, తన టీం ట్విటర్ లో షేర్ చేశామని రమ్య వెల్లడించారు. అయితే, ఆ ఫొటోలపై బీజేపీ విపరీతంగా ట్రోలింగ్ చేసి రాహుల్ ను అవమానించిందని, తన వల్లే రాహుల్ అవమాన పడ్డారని వెల్లడించారు.
అయితే, ఆ ఘటనకు బాధ్యురాలిగా తాను రాజీనామా చేసినా రాహుల్ దానిని అంగీకరించలేదని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పారని రమ్య చెప్పారు. కానీ, ఆ తర్వాత తాను పార్టీకి, సోషల్ మీడియా ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు. మూడేళ్ల క్రితం జరిగిన విషయాన్ని రమ్య ఇపుడు వెల్లడించడానికి వెనుక..కారణాలేమిటన్నదానిపై చర్చ జరుగుతోంది. రమ్య మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలన్న ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెట్టారని అనుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో అది అంత సులువు కాదని అంటున్నారు.